2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా గెలవని కిషన్ రెడ్డి ఆ తర్వాత ఎంపీ ఎన్నికల్లో విజయం సాధించాడు. ఏకంగా కేంద్రమంత్రి అయ్యాడు. కీలకమైన శాఖలు నిర్వర్తిస్తూ కేంద్రంలో చక్రం తిప్పుతున్నాడు. దానంతటికి కారణం ఇన్నాళ్లు ఆదరించిన ఆయన నియోజకవర్గమే.. అవును.. కిషన్ రెడ్డి రాజకీయ జీవితంలో ఆయనకు అండగా నిలిచింది హైదరాబాద్ లోని అంబర్ పేట నియోజకవర్గం. తాజాగా కిషన్ రెడ్డి జన ఆశీర్వాదయ యాత్ర అంబర్ పేటకు చేరుకోగా.. ఆయన ఎమోషనల్ అయ్యారు. కంటతడి పెట్టారు. ఉబికి వస్తున్న కన్నీళ్లను అదిమి పట్టుకొని భావోద్వేగ ప్రసంగం చేశఆరు.
జన ఆశీర్వాద సభ శనివారం గతంలో కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేసిన ఆయన సొంత నియోజకవర్గం అంబర్ పేటలో జరిగింది. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ కిషన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ‘అంబర్ పేటకు వస్తే చాలా రోజుల తర్వాత బిడ్డ తల్లిదగ్గరకు వచ్చినట్లు ’ ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నానంటే కారణం అంబర్ పేట ప్రజలు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలే. కేంద్రమంత్రి అయినందుకు సంతోషం లేదు. అంబర్ పేటకు దూరమయ్యానన్న బాధ ఉంది. అంబర్ పేట బిడ్డగా అందరూ గర్వపడేలా పనిచేస్తాను. అంబర్ పేటనే నాకు తల్లి. ఈ ప్రాంతమే నాకు జీవం పోసింది. పార్టీ అంబర్ పేట నాకు రెండు కళ్లు ’అని ఉద్వేగానికి గురయ్యారు కిషన్ రెడ్డి..
గతంలో అంబర్ పేటలో గల్లీ గల్లీ తిరిగి సమస్యలు పరిష్కరించాను. కానీ ఇప్పుడు ఢిల్లీలో ఉండాలి.. బాధ్యత పెద్దది అని కిషన్ రెడ్డి అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు సమీక్షించాలని.. భవిష్యత్తులోనూ మీరు ఆశీర్వదించాలని కిషన్ రెడ్డి అన్నారు.
మాస్క్ పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకున్నా గనుకే తనను కరోనా ఏం చేయలేదని కిషన్ రెడ్డి అన్నారు. తాను కరోనాను జయించానని చెప్పుకొచ్చాడు. ఇంట్లో తప్ప ఎక్కడా నేను మాస్క్ తీయలేదని.. అందుకే తనను కరోనా ఏం చేయలేదని కిషన్ రెడ్డి అన్నారు.
తెలుగురాష్ట్రాల నుంచి వరంగల్ లోని రామప్ప దేవాలయానికి ప్రపంచ గుర్తింపు తేవాలని పట్టుదలతో మోడీతో మాట్లాడాను. అన్ని దేశాలను ఒప్పించి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చాను. మీ అంబర్ పేట బిడ్డదే ఈ ఘనత.. గోల్కొండ కోటను కూడా అభివృద్ధి చేస్తానని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
మొత్తం కిషన్ రెడ్డి ఆశ్వీరాద యాత్ర ఎమోషనల్ గా.. సక్సెస్ ఫుల్ గా జరుగుతోంది. జనం నీరాజనం పెడుతున్నారు.