BJP Vittal: తెలంగాణ రాజకీయాల్లో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. టీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన హుజూరాబాద్ ప్రజలు స్పష్టమైన ఫలితం ఇచ్చారు. ఈ ఫలితంతో రాష్ట్రంలోని అందరికీ ఒక భరోసా వచ్చినట్టైంది. ఈ పరిణామం ఉద్యోగ సంఘాల నేతల్లో కూడా స్పష్టమైన మార్పునకు కారణం అవుతోంది. తెలంగాణ సమాజంలోని సబ్బండ వర్గాల్లో ఇప్పుడు కేసీఆర్ పాలనపై వ్యతిరేకత పెల్లుబుకుతోందని అర్థమవుతోంది. అది ఇతర వర్గాలకు విస్తరిస్తోంది. తాజాగా ఉద్యోగ సంఘాలను చేరింది. తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యోగ సంఘం కీలక నేత ఇప్పుడు బీజేపీలో చేరడం చర్చనీయాంశమైంది. దీన్ని బట్టి ఉద్యోగ సంఘాల నేతలు తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్మాయ శక్తిగా ఎదుగుతున్న బీజేపీవైపు చూస్తున్నారని అర్థమవుతోంది. రెండు సార్లు అధికారం సాధించిన కేసీఆర్ ముచ్చటగా మూడోసారి గద్దెనెక్కడం కష్టమని దీన్ని బట్టి తెలుస్తోంది.

నీళ్లు, నిధులు, నియామకం లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఉద్యమం లో గళమెత్తిన తెలంగాణ విఠల్ సోమవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకుల సమక్షంలో కమలం పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే బీజేపీ జాతీయ ,రాష్ట్ర నాయకుల ఆశీస్సులు పొందిన సిహెచ్ విఠల్ పార్టీ లో చేరడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యార్థి దశ నుండి ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన ఆయన మొదటిసారిగా రాజకీయ ప్రవేశం చేస్తున్నారు. కేసిఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పెట్టకముందు నుంచే ప్రొఫెసర్ జయశంకర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు చేశారు. నీళ్లు నిధులు నియామకాల కార్యక్రమ సృష్టికర్త, ఉద్యమ కార్యక్రమాల వ్యూహకర్త ఆయన పేరే తెలంగాణ విఠల్ గా ప్రజలు.. అభిమానులు.. ఉద్యమ నేతలు నామకరణం చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారి నాయకత్వం పట్ల గౌరవ భావంతో ఉండే విఠల్ తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు న్యాయం జరగాలంటే ఒక్క బీజేపీతోనే సాధ్యం అని అందుకే తన వంతుగా భారతదేశానికి తద్వారా రాష్ట్రానికి సేవ చెయ్యాలంటే బీజేపీ నే మార్గమని భావించి ఆ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. దీన్ని బట్టి తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యమకారులు సైతం కేసీఆర్ తీరుకు విసిగిపోయి ఇక బీజేపీ బాట పడుతున్నట్టు అర్థమవుతోంది. విఠల్ చేరిక వెనుక ఈటల రాజేందర్ ఉన్నట్టు సమాచారం. టీఆర్ఎస్ అసంత్రుప్తులందరినీ తనవైపు తిప్పుకుంటూ ఈటల కేంద్రబిందువు అయ్యారని ప్రచారం సాగుతోంది. మరింత మంది ఈటల సమక్షంలో బీజేపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
ఉద్యోగ సంఘాల నాయకునిగా తెలంగాణ లో తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులు అయిన విఠల్ గత సంవత్సరం వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యునిగా సేవలందించారు. బిజెపి లో చేరడానికి ఆహ్వానించి సమన్వయం చేసిన బీజేపీ జాతీయ రాష్ట్రనాయకులు జేపీ నడ్డా కి, తరుణ్ చుగ్ కు, బండి సంజయ్ , కిషన్ రెడ్డి ,డీకే అరుణ , లక్ష్మణ్ , జితేందర్ రెడ్డి , వివేక్ వెంకటస్వామి , రాజాసింగ్ , ఈటెల రాజేందర్ , అరవింద్ ,సోయం బాపురావు , రఘునందన్ రావు , స్వామి గౌడ్ లకు ఈ సందర్భంగా విఠల్ కృజ్ఞతలు తెలిపారు.