Union Budget 2025 : దేశవ్యాప్తంగా మధ్యతరగతి వర్గం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈసారి పన్ను మినహాయింపుల ద్వారా వేతన జీవులకు ఊరట కల్పించొచ్చనే అంచనాలు పెరుగుతున్నాయి. అయితే, అదే సమయంలో పాత పన్ను విధానాన్ని (Old Tax Regime) రద్దు చేసే అవకాశముందని కొన్ని వార్తలు వెలువడుతున్నాయి.
పాత-కొత్త పన్ను విధానాల ప్రస్తుత పరిస్థితి
ప్రస్తుతం ఆదాయపు పన్నుకు సంబంధించి రెండు విధానాలు – పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం అమల్లో ఉన్నాయి. 2020 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది. కొత్త విధానం ప్రవేశపెట్టినప్పటి నుంచి పాత విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. పన్ను శ్లాబులు, ప్రాథమిక మినహాయింపు పరిమితి పెంపు, స్టాండర్డ్ డిడక్షన్ పెంపు వంటి అన్ని మార్పులూ కొత్త పన్ను విధానంలోనే చేపట్టారు.
పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తారా?
ఇప్పటివరకు ప్రభుత్వ వైఖరి చూస్తే, కొత్త పన్ను విధానాన్ని ప్రోత్సహించడానికే దృష్టి సారించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో 2025 బడ్జెట్‌లో పాత పన్ను విధానానికి ముగింపు పలుకుతామన్న సంకేతాలు ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, ఈ ఊహాగానాలు ఎంతవరకు నిజమవుతాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
నిపుణుల భిన్నాభిప్రాయాలు
పాత పన్ను విధానం తొలగింపు అంశంపై చార్టర్డ్ అకౌంటెంట్లు, పన్ను నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త పన్ను విధానం లెక్కించడానికి సులభమైనదని, దాదాపు 70% మంది టాక్స్ ఫైలర్లు దీన్ని ఎంచుకున్నారని ఒక వర్గం పేర్కొంటోంది. అయితే, పాత పన్ను విధానం రద్దు చేస్తే రియల్ ఎస్టేట్, పన్ను ఆదా పథకాలు ప్రభావితమవుతాయని మరికొందరు చెబుతున్నారు. మొత్తానికి, కేంద్ర ప్రభుత్వం పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తుందా? లేక దానిని క్రమంగా తుదికి చేర్చే ప్రక్రియ మొదలుపెడుతుందా? అన్నది ఫిబ్రవరి 1 బడ్జెట్‌లోనే తెలుస్తుంది.