https://oktelugu.com/

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పోటీపై ఊహించని ట్విస్ట్..

మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ రెండు చోట్ల పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బిజెపి సలహాతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో బిజెపి మూడోసారి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : February 12, 2024 / 03:35 PM IST
    Follow us on

    Pawan Kalyan: ఏపీలో పొత్తు ప్రయత్నాలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. టిడిపి, బిజెపి, జనసేన మధ్య పొత్తు దాదాపు ఖరారైంది. సీట్ల సర్దుబాటే పెండింగ్ లో ఉంది.ఇటువంటి తరుణంలో మూడు పార్టీల నాయకులు ఎక్కడెక్కడ పోటీ చేస్తారు? అన్నది కీలకంగా మారింది. కుప్పం నుంచి చంద్రబాబు, మంగళగిరి నుంచి నారా లోకేష్, అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి నాగబాబు పోటీ చేస్తారని తెలుస్తోంది. కానీ పవన్ విషయంలో మాత్రం ఎటువంటి స్పష్టత లేదు. గత ఎన్నికల్లో గాజువాక తో పాటు భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన పవన్.. రెండు చోట్ల ఓడిపోయారు. అయితే ఈసారి అసెంబ్లీకి వెళ్లాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు. అయితే గతం మాదిరిగా రెండు చోట్ల పోటీ చేస్తారా? ఒక్కచోట? అన్నది మాత్రం తెలియడం లేదు.

    అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ రెండు చోట్ల పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బిజెపి సలహాతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో బిజెపి మూడోసారి అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే నమ్మదగిన మిత్రుడు గా ఉన్న పవన్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవాలని బిజెపి హై కమాండ్ భావిస్తోంది. అందుకే ఈసారి ఎంపీగా పోటీ చేయాలని పవన్ పై ఒత్తిడి పెడుతున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎమ్మెల్యే గాను పోటీచేయాలని పవన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒకవేళ రాష్ట్రంలో ప్రతికూల ఫలితాలు వస్తే.. ఎంపీగా గెలిచి కేంద్రంలో చక్రం తిప్పాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదంతా కేంద్ర పెద్దల సూచన మేరకే జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

    పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాల జాబితా చాలానే ఉంది. భీమవరం, పిఠాపురం, తిరుపతి వంటి నియోజకవర్గాల్లో పవన్ ఇప్పటికే సర్వేలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. కాకినాడలో మూడు రోజులు మకాం వేసిన పవన్ అక్కడ పార్టీ బలాబలాలపై సమాచారం సేకరించారు. దీంతో ఆయన కాకినాడ నుంచి అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే పవన్ ఆలోచన వేరేలా ఉన్నట్లు తెలుస్తోంది. కాకినాడ పార్లమెంట్ స్థానంతో పాటు భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. తద్వారా ఉభయగోదావరి జిల్లాల్లో కూటమి అభ్యర్థులు గెలిచేలా వ్యూహం పన్నుతున్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ ఎక్కడా నోరు మెదపడం లేదు. పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాల ప్రకటన కోసం పార్టీ శ్రేణులు ఆశగా ఎదురుచూస్తున్నాయి. దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.