https://oktelugu.com/

UPI Payments: డిజిటల్ బాటలో శ్రీలంక, మారిషస్.. నేడు మన యూపీఐ సేవలు ప్రారంభం

సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె, మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జుగ్నాథ్ కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : February 12, 2024 / 03:42 PM IST
    Follow us on

    UPI Payments: “డిజిటల్ కరెన్సీ దిశగా దేశం పరుగులు తీస్తుందని” అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిదంబరం నొసలు చిట్లించారు. “ఇంత పెద్ద దేశంలో డిజిటల్ కరెన్సీ ఎలా అమలు చేస్తారంటూ” ఆయన విమర్శించారు. ఈలోగా పేటీఎం తెరపైకి రావడం.. కొవిడ్ మహమ్మారి విజృంభించడం.. డిజిటల్ కరెన్సీ వినియోగం పెరగడంతో ఒక్కసారిగా దేశంలో సమూల మార్పులు సంభవించాయి. దీంతో నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్న మాటలే నిజమయ్యాయి. ప్రస్తుతం మన దేశంలో “పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే, అమెజాన్ పే” వంటి సంస్థలు డిజిటల్ చెల్లింపులు చేపడుతున్నాయి. వీటన్నింటినీ “యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్” సంస్థ పర్యవేక్షిస్తున్నది. సగటున మనదేశంలో రోజుకు వందల కోట్ల రూపాయల విలువైన డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ సేవలు సోమవారం నుంచి శ్రీలంక, మారిషస్ దేశాలలోనూ ప్రారంభమయ్యాయి.

    సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె, మారిషస్ ప్రధానమంత్రి ప్రవింద్ జుగ్నాథ్ కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. “శ్రీలంక, మారిషస్ దేశాలలో యూపీఐ సేవలు ప్రారంభించడం వల్ల వేగవంతమైన, అవరోధాలు లేని డిజిటల్ లావాదేవీలు కొనసాగించవచ్చు. యూపీఐ ద్వారా డిజిటల్ కనెక్టివిటీని పెంచడం వల్ల వేలాది మందికి ప్రయోజనం కలుగుతుంది. శ్రీలంక, మారిష దేశాలకు ప్రయాణించే భారతీయ పౌరులకు, అలాగే మారిషస్, శ్రీలంక దేశాల నుంచి భారత్ వచ్చే పర్యాటకులకు యూపీఐ సేవలు ఉపయుక్తంగా ఉంటాయి మారిషస్ దేశంలో రూపే కార్డు సేవలను పొడిగించడం వల్ల మనదేశ పర్యాటకులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. రూపే మెకానిజం ఆధారంగా మారిషస్ బ్యాంకులు కార్డులు జారీ చేసేందుకు అవకాశం ఉంటుంది. భారత్, మారిషస్ లో సెటిల్మెంట్ల కోసం రూపే కార్డును ఉపయోగించడం అత్యంత సులభతరం అవుతుందని” భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది.

    ఏమిటి ఈ యూపీఐ

    నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్ సైట్ ప్రకారం.. యూపీఐ అనేది బహుళ బ్యాంకు ఖాతాలను ఒక మొబైల్ అప్లికేషన్ లాగా పనిచేసే వ్యవస్థ. బ్యాంకింగ్ ఫీచర్లు, ఫండ్ రూటింగ్, చెల్లింపులకు ఇది ఉపయోగపడుతుంది. యూపీఐని మొట్టమొదటిసారిగా 2016 ఏప్రిల్ 11న ముంబైలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ప్రారంభించారు. ఫిన్ టెక్ టెక్నాలజీగా యూపీఐ భారత్ లో అతిపెద్ద విజయం సాధించింది. దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగేందుకు ఇది దోహదం చేసింది. ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ ప్రకారం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ మన దేశంలో 38 కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులను కలిగి ఉంది. గత నెలలో 1220 కోట్ల లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయి.. ఇటీవల ఫ్రాన్స్ దేశంలోనూ యూపీఐ సేవలు ప్రారంభమయ్యాయి. యూపీఐ మెకానిజం ద్వారా ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ సందర్శన కోసం టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చు.