Telangana BJP: మరో మూడు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగబోతున్నాయి. దీంతో తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అదే జోష్‌ను లోక్‌సభ ఎన్నికల్లో కొనసాగించాలని భావిస్తోంది. ఈమేరకు బరిలో బలమైన అభ్యర్థులను నిలిపేందుకు యత్నిస్తోంది. ఇందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌లోని అభ్యర్థులతో సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు లోక్‌సభ నియోజకవర్గాలకు మంత్రులను ఇన్‌చార్జీలుగా నియమించింది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవంతో చలికిల పడిన బీఆర్‌ఎస్.. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలనుకుంటోంది. దీంతో ఇస్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. అభ్యర్థుల ఎంపికకు కసరత్తు చేస్తోంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో బలం పుజుకుంది. గతంలో ఒక ఎమ్మెల్యే ఉండగా, తాజాగా 8 మంది గెలిచారు. 19 మంది రెండో స్థానంలో నిలిచారు. చాలా నియోజకవర్గాల్లో ఓట్ల శాతంమూ పెరిగింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో మరింత పుంజుకోవాలని కమలం పార్టీ కసరత్తు చేస్తోంది.
హైదరాబాద్‌పై నజర్…
తెలంగాణలో కీలకమైన లోక్‌సభ నియోజకవర్గం హైదరాబాద్. ఇది ఎంఐఎంకు కంచుకోట. దాదాపు 5 దశాబ్దాలుగా ఇక్కడి నుంచి ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ విజయం సాధిస్తున్నారు. కానీ, ఈసారి ఈ సీటును తన ఖాతాలో వేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగా ఈసారి హైదరాబాద్ ఎంపీగా రాజాసింగ్‌ను బరిలో దించాలని భావిస్తోంది. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలోని గోషామహల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్‌ను నిలపడం ద్వారా.. హిందుత్వ వాదాన్ని బలంగా తెలంగాణలో క్షేత్రస్థాయికి తీసుకెళ్లవచ్చనేది బీజేపీ వ్యూహం. మరోవైపు ఎంఐఎంతో దోస్తీకి యత్నిస్తున్న అధికార కాంగ్రెస్‌తోపాటు ఎంఐఎంకు ఒకేసారి చెక్ పెట్టవచ్చని కమలం పార్టీ ప్లాన్‌గా కనిపిస్తోంది.
పాత బస్తీపై పట్టు..
హైదరాబాద్ అంటేనే పాతబస్తీ.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పాత బస్తీలోని మూడు నియోజకవర్గాల్లో బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఒక స్థానంలో విజయం సాధించింది. మొత్త ఏడు నియోజకవర్గాల్లో నాలుగింటిలో బీజేపీ బలం అనూహ్యంగా పెరిగింది. ఇది కూడా తమకు లాభిస్తుందని కమలనాథులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అగ్రెసివ్ హిందుత్వ వాది అయిన రాజాసింగ్‌ను హైదరాబాద్ బరిలో నిలపడం ద్వారా ఎంఐఎం కంచుకోటను బద్ధలు కొట్టాలన్నది మోదీ వ్యూహంగా కనిపిస్తోంది. పాతబస్తీ కేంద్రంగా రాజకీయాలు చేస్తున్న ఎంఐఎం.. ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్, పశ్చిమ బెంగాల్, గోవా, హరియాణా, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పనోటీ చేసి మెరుగైన ఓట్లు సీట్లు సాధించింది. దీంతో ఎంఐఎంకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో మోదీ అడుగులు వేస్తున్నారు.
గతంలో ఏ పార్టీ చేయని సాహసం..
తెలంగాణలో గతంలో ఎంఐఎంపై బలమైన అభ్యర్థిని నిలిపేందుకు ఏ పార్టీలు ప్రయత్నించలేదు. ముఖ్యంగా అధికార పార్టీలన్నీ ఎంఐఎంను ఫ్రెండ్లీ పార్టీగా చూశాయి. దీంతో ఎంఐఎంకు పాత బస్తీపై పట్టు సడలడం లేదు. హైదరాబాద్ లోక్‌సభ సీటు ఎంఐఎందే అన్న భావన ఏర్పాడింది. కానీ దీనిని మార్చాలని కమలం భావిస్తోంది. గత చరిత్రకు భిన్నంగా.. బలమైన రాజీసింగ్‌ను ఎంఐఎం అభ్యర్థి అసద్‌పై పోటీకి పట్టి నెగ్గడంలో కిక్కే వేరుగా ఉంటుంది అన్న ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం హిందుత్వ వాదాన్ని బలంగా క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ఉత్తర భారతదేశంతోపాటు దక్షిణాదిన కూడా హిందుత్వ వాదం బలపడుతోంది. ఇదే సయంలో అయోధ్య రామ మందిరం ప్రారంభం కాబోతోంది. ఈతరుణంలో హిందుత్వ ఎజెండాతోనే దేశంలో మూడోసారి అధికారంలోకి రావాలని మోదీ భావిస్తున్నారు. అందుకే బలమైన, కరుడుగట్టి హిందుత్వ వాది అయిన రాజాసింగ్‌ను హైదరాబాద్ బరిలో నిలపాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More