
కరోనా వ్యాప్తి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. దీంతో ప్రముఖ సంస్థలన్ని ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంకి అనుమతించాయి. ఈ క్రమంలోనే ప్రముఖ సోషల్ మీడియా సంస్థ అయిన ట్విట్టర్ కూడా తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చింది. తాజాగా దీనికి సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంది.
రోజు రోజుకి కరోనా కేసులు సంఖ్య పెరుగుతుండడంతో ఇక నుంచి ట్విట్టర్ ఉద్యోగులు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం చేసేందుకు అనుమతించినట్టు సీఈవో జాక్ డోర్సీ తెలిపారు. సెప్టెంబర్ వరకు ట్విట్టర్ ఆఫీసులు తెరువబోమని ఆయన స్పష్టం చేశారు. లాక్ డౌన్ ముగిశాక కూడా ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేలా కొత్త విధానాన్ని రూపొందించినట్టు తెలిపారు. ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇదే తరహాలో ఫేస్ బుక్, గూగుల్ సంస్థలు కూడా ట్విట్టర్ దారినే ఎంచుకునే సూచనలు కనిపిస్తున్నాయి.