
ఎల్.జి పాలిమర్స్ దుర్ఘటనలో భాదితుల ఆరోగ్య పరిరక్షణకు ఐదు గ్రామాలకు ఒక సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి నెలకొల్పాలని, విషవాయు బాధితులు అందరికీ ఆ హాస్పటల్ లోనే ఎప్పటికప్పుడు అత్యున్నత చికిత్స అందించాలని టీడీపీ పొలిట్ బ్యూరో తీర్మానించింది. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశం వీడియో కాన్ఫరెన్స్ విధానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత గ్యాస్ లీకేజి మృతులకు నివాళులర్పించారు. బాధితులకు అండగా ఉండాలని తీర్మానం చేసింది. రెండు రాష్ట్రాలలో కోవిడ్ మృతులకు నివాళులు అర్పించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేసింది. రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు, చేనేత కార్మికులు, కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటాన్ని ఖండించింది. తక్షణమే ఆయా కుటుంబాల వారిని ఆదుకోవాలని డిమాండ్ చేసింది. విశాఖ మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ సహా నగరంలోని జలాశయాల్లో నీళ్లు కలుషితం కావడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ఇళ్లలోకి వచ్చినవాళ్లు కూడా విషవాయువు తీవ్రతకు భయపడి మళ్లీ వెళ్లిపోవడం ఆందోళనకరని వెల్లడించారు.
అక్కడ నిద్రించినట్లు వైసిపి నాయకులు చీప్ ట్రిక్స్ ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికి కూడా ఎల్జీ పాలిమర్స్ కంపెనీది తప్పు అని వైసిపి నాయకులు చెప్పలేక పోతున్నారని చంద్రబాబు తెలిపారు. ట్యాంకర్లలో ఉన్న స్టైరీన్ ను విదేశాలకు పంపడంపై రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు.
గుంటూరులో వైసిపి నాయకుడు ఇచ్చిన విందు వల్ల దుష్ఫలితాలు చూశామని, వైసిపి ఎమ్మెల్యేలే కరోనా సూపర్ స్ప్రెడర్లుగా మారారన్నారు. శ్రీకాళహస్తిలో ట్రాక్టర్ల ర్యాలీ, నగరిలో, కనిగిరిలో ఇష్టారాజ్యంగా వ్యవహరించి వైరస్ వ్యాప్తికి కారణం అయ్యారని తెలిపారు. ఏపిలో కరోనా కష్టకాలంలో కూడా, చివరికి బ్లీచింగ్ లో కూడా రూ70కోట్ల కుంభకోణానికి పాల్పడటాన్ని ఖండించారు. కరోనా కిట్ల కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారన్నారు. నాసిరకం శానిటైజర్లు, నాసిరకం మాస్క్ లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. మడ అడవులను విచక్షణా రహితంగా నరికేయడాన్ని పోలిట్ బ్యూరోలో టిడిపి నేతలు ఖండించారు. దీనివల్ల భవిష్యత్తులో తీరప్రాంతానికి తుఫాన్ల ముప్పు ఉంటుందని హెచ్చరించారు. ఫ్రంట్ లైన్ వారియర్ల కృషికి టిడిపి పోలిట్ బ్యూరో అభినందన తెలిపారు.
ఈ విపత్కర పరిస్థితిలో కరెంటు ఛార్జీలను పెంచడాన్ని ఖండించింది. కరెంటు ఛార్జీలు పెంచేది లేదని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ గాలికి వదిలేసి 4 రెట్లు పెంచారని చెప్పారు. పేదలకు అండగా తెలుగుదేశం పార్టీ ఉందన్నారు. టిడిపి నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో గర్హించింది. విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటనలో బాధితులపై, వారికి అండగా నిలబడ్డ ప్రతిపక్షాల నాయకులపై కేసులు పెట్టడాన్ని ఖండించింది. టిడిపి మహానాడు నిర్వహణపై చర్చ జరిగింది.