హుజూరాబాద్ లో బీజేపీ తరుఫున ఈటల రాజేందర్ పోటీచేయడం లేదా? చివరి సమయంలో ఈ ట్విస్ట్ ఇవ్వబోతున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. తాజాగా హుజూరాబాద్ పొలిటికల్ తెరపై ఈటల భార్య జమున ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హుజూరాబాద్ లో జరుగనున్న ఉప ఎన్నికల్లో పోటీలో తానున్నా.. రాజేందర్ ఉన్నా ఒక్కటేనని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ప్రచారం సందర్భంగా జమున మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజేందర్ వెన్నంటే ఉన్నారని.. ఇప్పుడు కూడా అలానే ఉండాలని జమున చెప్పుకొచ్చారు. ఎవరు పోటీచేయాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
హుజూరాబాద్ లో ఎవరికి అవకాశం వస్తే వారు పోటీచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. తమ ఇద్దరిలో ఎవరు పోటీచేసినా గుర్తు కమలం పార్టీదేనని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే హుజూరాబాద్ లో మంత్రి ఈటల రాజేందర్ పోటీచేస్తారా? లేదా ఆయన భార్య బరిలో ఉంటారా? అన్నది ఆసక్తిగా మారింది. జమున మాటలను బట్టి ఈటలను బీజేపీ జాతీయ రాజకీయాల్లోకి మరల్చి ఆమెను హుజూరాబాద్ లో పోటీకి దిగుతారు కావచ్చని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందనేది వేచిచూడాలి.