TVVP Doctors: బంగారు తెలంగాణలో..ఉద్యోగాలు లేవ్.. ఉద్యోగోన్నతులూ లేవ్

టీవీవీపీ లో కేడర్ స్ట్రెంత్ పై ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఇక డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి టీవీవీపీకి 79 ఆసుపత్రులు వచ్చాయి.

Written By: Bhaskar, Updated On : May 31, 2023 6:51 pm

TVVP Doctors

Follow us on

TVVP Doctors: “మనది నెంబర్ వన్ రాష్ట్రం. సగటు తలసరి ఆదాయంలో దూసుకుపోతున్న రాష్ట్రం. దేశానికి మనం అన్నం పెడుతున్నాం. రాష్ట్ర ఉద్యోగులను కడుపులో పెట్టి చూసుకుంటున్నాం. వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. వేల కోట్లు ఖర్చు చేసి ఆసుపత్రులు నిర్మిస్తున్నాం” ఇలా ఉంటాయి కెసిఆర్ మాటలు. కానీ ఆచరణలో అందుకు విరుద్ధంగా కనిపిస్తుంటాయి. తెలంగాణ ఉద్యమంలో వైద్యుల పాత్ర విస్మరించలేనిది. వాస్తవానికి తమ సమస్యల పరిష్కారం కోసం మాత్రమే సమ్మె చేసే వైద్యులు.. తెలంగాణ ఉద్యమంలో వారు కూడా తొలిసారిగా సమ్మె బాట పట్టారు. తెలంగాణ ధూమ్ ధాం నుంచి సకలజనుల సమ్మె దాక ప్రతి దాంట్లో వారిదైన పాత్ర పోషించారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తెలంగాణ ఏర్పాటు సాకారం అయినప్పటికీ.. వైద్యుల సమస్యలు పరిష్కారం కాలేదు అంటే అతిశయోక్తి కాదు.

రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాల అవుతున్నా..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కరించకపోవడం దారుణమని తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలోని వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీవీవీపీ లో ఇంతవరకూ స్తులు మంజూరు చేయకపోడాన్ని వారు తప్పుపడుతున్నారు. వైద్య విధాన పరిషత్తులు అనేక సమస్యలు ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, ఇతర ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఫలితం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మాకు సర్కారు మీద నమ్మకం పోయిందని, త్వరలోనే సమ్మె కార్యాచరణపై చర్చించేందుకు హైదరాబాదులో సమావేశం కావాలని వారు నిర్ణయించారు.

పోస్టులు మంజూరు చేయలేదు

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీవీవీపీ లో ఇంతవరకు ఒక పోస్ట్ కూడా మంజూరు చేయకపోవడం విశేషం. టీవీవీపీ లో జాయింట్ కమిషనర్, ప్రోగ్రాం ఆఫీసర్స్, డి సి హెచ్ ఎస్ (డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హెల్త్ సర్వీస్) పోస్టులను ఇంతవరకు మంజూరు చేయలేదు.టీవీవీపీకి పూర్తిస్థాయిలో కమిషనర్ లేరంటే పరిస్థితి వ్రతను అర్థం చేసుకోవచ్చు.. ఈ విభాగంలో రెండు జాయింట్ కమిషనర్ పోస్టులు ఉన్నాయి. వాటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ప్రధాన కార్యాలయంలో రోజువారి కార్యకలాపాలు నిర్వహించేందుకు అవసరమైన ప్రోగ్రాం ఆఫీసర్ పోస్టులు కూడా ప్రభుత్వం మంజూరు చేయలేదంటే అక్కడ దుస్థితి ఎలా ఉందో ఇట్టే అవగతం చేసుకోవచ్చు. మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్న ఉమ్మడి పది జిల్లాల ఆధారంగా డిసిహెచ్ఎస్ పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులను కూడా ప్రోగ్రాం ఆఫీసర్ పేరుతో ప్రధాన కార్యాలయానికి మార్చేశారు. దీంతో డిసిహెచ్ఎస్ పోస్టుల ఊసే లేకుండా పోయింది. ప్రస్తుతం ఉన్న 33 జిల్లాలకు కొత్త డిసిహెచ్ పోస్టులు ఏర్పాటు చేయలేదు. వీటితోపాటు ప్రధాన కార్యాలయంలో మరో ఐదు జాయింట్ కమిషనర్ పోస్టు లు మంజూరు చేయాల్సి ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలో పోస్టులు మంజూరు చేసి తమను పట్టించుకోకపోవడమే టీవీవీపీ పరిధిలోని వైద్యుల ఆగ్రహానికి కారణం అవుతున్నది.

లీడర్ స్ట్రెంత్ పై పట్టింపేది?

టీవీవీపీ లో కేడర్ స్ట్రెంత్ పై ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఇక డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి టీవీవీపీకి 79 ఆసుపత్రులు వచ్చాయి. భారత ప్రజారోగ్య ప్రమాణాల ప్రకారం 30 పడకల ఆసుపత్రికి 11 మంది వైద్యులు, 50 పడకలకు 32 మంది, వంద పడకలకు 44 మంది వైద్యులు ఉండాలి. ఈ పోస్టులను ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉంది. ఈ ప్రకారం టీవీవీపీ పరిధిలోని 17 జిల్లా ఆస్పత్రులు గత ఏడాది, ఈ ఏడాది వైద్య విద్య సంచాలకుల పరిధిలోకి వెళ్లాయి. అవి బోధన ఆస్పత్రులుగా మారాయి. ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు ఇప్పటికీ అదే ఆసుపత్రిలో ఉన్నారు. ఇలా 300 మంది వరకు స్పెషాలిటీ వైద్యులు వైద్య కళాశాలల్లోనే ఉండిపోయారు. వారిని టీఎంఈ ఇంకా రిలీజ్ చేయలేదు. అక్కడ ఉన్న పోస్టులను కూడా పునర్విభజన చేయలేదు. డీఎంఈ, డీ హెచ్ పరిధిలో పదోన్నతులు, కేడర్ స్ట్రెంత్ ను చక చకా తేల్చేస్తున్న ప్రభుత్వం వైద్య విధాన పరిషత్ ను మాత్రం పట్టించుకోవడం లేదు.