తుమ్మల కేంద్రంగా మలుపుతిరగనున్న తెలంగాణ రాజకీయం?

తెలంగాణలో మరో కీలక నాయకుడు తుమ్మల నాగేశ్వర్‌‌. మాజీ మంత్రి అయిన తుమ్మలది రాజకీయాల్లో తనదైన స్టైల్‌. ఎప్పుడూ ఏదో ఒక వార్తతో హల్‌చల్‌ చేస్తుంటారు. తెలంగాణ ఏర్పాటు ముందు వరకు ఆయన టీడీపీలో కొనసాగగా.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నారు. అయితే.. ఇటీవల మరో ఆసక్తికర వార్త ఒకటి వినిపిస్తోంది. తెగ వైరల్‌ కూడా అవుతోంది. ఆయన తన పాత మిత్రుడు.. టీడీపీ మాజీ నాయకుడు, ప్రస్తుతం బీజేపీ ఉన్న నేత అయిన ఏపీ […]

Written By: Srinivas, Updated On : March 25, 2021 12:05 pm
Follow us on


తెలంగాణలో మరో కీలక నాయకుడు తుమ్మల నాగేశ్వర్‌‌. మాజీ మంత్రి అయిన తుమ్మలది రాజకీయాల్లో తనదైన స్టైల్‌. ఎప్పుడూ ఏదో ఒక వార్తతో హల్‌చల్‌ చేస్తుంటారు. తెలంగాణ ఏర్పాటు ముందు వరకు ఆయన టీడీపీలో కొనసాగగా.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉన్నారు. అయితే.. ఇటీవల మరో ఆసక్తికర వార్త ఒకటి వినిపిస్తోంది. తెగ వైరల్‌ కూడా అవుతోంది. ఆయన తన పాత మిత్రుడు.. టీడీపీ మాజీ నాయకుడు, ప్రస్తుతం బీజేపీ ఉన్న నేత అయిన ఏపీ ఎంపీతో సన్నిహితంగా ఉంటున్నారట. రాజ‌కీయాల‌పై చ‌ర్చలు జ‌రుపుతున్నార‌ని.. పెద్ద ఎత్తున ప్రచారం జ‌రుగుతోంది.

ప్రస్తుతం ఈ టాపిక్‌ తెలంగాణ రాజ‌కీయాల్లో.. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మాత్రం హల్‌చల్‌ చేస్తోంది. ఖ‌మ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర‌రావు గ‌తంలో టీడీపీలో ప‌నిచేశారు. త‌ర్వాత కేసీఆర్ గూటికి చేరిపోయారు. ఈ క్రమంలో కేసీఆర్ ద‌గ్గర మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కూడా. ఫ‌స్ట్ టెర్మ్‌లో మంత్రిగా కూడా చేశారు. ఇక‌.. గ‌త 2018 ఎన్నిక‌ల్లో పోటీ చేసిన తుమ్మల నాగేశ్వర‌రావు ఓడిపోయారు. ఈ క్రమంలో ఆయ‌న‌కు ఎమ్మెల్సీ పదవి ఇస్తార‌నే ప్రచారం జ‌రిగింది. అయితే.. ఎన్నిక‌ల ప్రచారంలో ఆయన ఆసక్తికర కామెంట్లు చేశారు. ‘గెలిస్తే అసెంబ్లీలో ఉంటా.. లేకుంటే.. నా పొలంలో ఉంటా..!’ అని వ్యాఖ్యానించారు.. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఓడిపోయిన త‌ర్వాత త‌న పొలంలో ప‌నులు చేసుకుంటున్నారు.

అయితే.. మ‌ళ్లీ ఆ మధ్య కేసీఆర్ నుంచి పిలుపు వ‌చ్చింది. దీంతో తుమ్మలకు ఎమ్మెల్సీ ఇస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అనూహ్యంగా ఈ విష‌యంలో మంత్రి కేటీఆర్ అయిష్టత చూపారని టాక్‌. దీంతో తుమ్మల నాగేశ్వర‌రావుకు అవ‌కాశం వ‌చ్చిన‌ట్టే వ‌చ్చి జారి పోయింది. ఈ ప‌రిణామంతో ఆయ‌న ఒకింత ఆవేద‌న‌తో ఉన్నారు. అయితే.. ఇదేదో పార్టీతో తెగ‌తెంపులు చేసుకునే ప‌రిస్థితి లేద‌నేది వాస్తవం. ఇక‌.. ఏపీ బీజేపీకి చెందిన ఒక ఎంపీ.. గ‌తంలో కేంద్రంలో మంత్రిగా కూడా ప‌నిచేసిన ఆయ‌న‌తో ఇప్పుడు తుమ్మల నాగేశ్వర‌రావు ట‌చ్‌లో ఉన్నార‌నే వార్తలు మాత్రం ఆస‌క్తి రేపుతున్నాయి.

కొద్ది రోజులుగా తుమ్మల నాగేశ్వర‌రావు బీజేపీలోకి వెళ్లిపోతున్నార‌న్న వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. వీటిని తుమ్మల ఖండించినా ఈ ప్రచారానికి మాత్రం బ్రేక్ పడలేదు. అయితే.. దీనిని రాజ‌కీయ కోణంలోనే చూడాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ్యాపారాలు, ఇత‌ర అవ‌స‌రాలు.. ఉండి ఉన్న నేప‌థ్యంతో పాటు గ‌తంలో టీడీపీలో ఇద్దరూ క‌లిసి ప‌నిచేసిన అనుభ‌వం, పూర్వ ప‌రిచ‌యాలు వంటివి కూడా కార‌ణ‌మై ఉంటాయ‌ని తుమ్మల వర్గం అంటోంది. మొత్తంగా ఇప్పుడు తుమ్మల వ్యవహారం మాత్రం.. అటు ఏపీలో.. ఇటు ఉమ్మడి ఖమ్మంతోపాటు టీఆర్‌‌ఎస్‌ పార్టీలో చర్చకు దారితీస్తోంది.