Muthireddy Yadagiri Reddy: భూ వివాదంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డి మధ్య ఘర్షణ జరుగుతోంది. మొన్నటికి మొన్న తెలంగాణ దశాబ్ది వేడుకల్లో పాల్గొన్న తన తండ్రిని నిలదీసింది. వివాదాల్లో ఉన్న భూమిని తన పేరు మీద ఎందుకు రిజిస్ట్రేషన్ చేయాల్సి వచ్చిందో అడిగేసింది. దీంతో ముత్తిరెడ్డికి ఏం చేయాలో పాలు పోలేదు. పైగా ఈ వ్యవహారానికి సంబంధించి ఆమె ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది జరిగిన తర్వాత ఆదివారం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కి షాక్ ఇస్తూ తుల్జా భవాని రెడ్డి సరికొత్త నిర్ణయం తీసుకుంది.
ఇక భూ వివాదానికి సంబంధించి తుల్జా భవాని రెడ్డి తన తండ్రి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మీద మరోసారి అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఆదివారం ఉదయం చేర్యాల చేరుకున్న భవాని రెడ్డి తన పేరుపై ఉన్న భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను కూల్చేశారు. తన తండ్రి ప్రభుత్వ భూమిని కబ్జా చేసి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారని, ఆ భూమి తనకు వద్దని ఆమె స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆ భూమిని మున్సిపాలిటీకి అప్పగిస్తానని మాట కూడా ఇచ్చారు. గ్రామ స్థలాన్ని తన తండ్రి తన పేరుపైన రిజిస్ట్రేషన్ చేసినందుకు క్షమించాలని గ్రామస్తులను వేడుకున్నారు.
“చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు మత్తడి వద్ద 1270 గజాల స్థలాన్ని నా పేరు మీద రాశారు. నా తండ్రి దానిని అక్రమంగా సంప్రదించారు. దీనివల్ల నాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలు నన్ను విచారణ పేరుతో పదేపదే పిలుస్తున్నారు. సమాజంలో గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన దాన్ని. ఇలాంటి కేసులు ఎదుర్కోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనంతటికీ కారణం మా నాన్న. గతంలో పలుమార్లు ఆయనకు చెప్పాను. అయినప్పటికీ వినిపించుకోలేదు. అందుకే నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిన స్థలంలో నిర్మించిన ప్రహరీ గోడను కూల్చేశాను. ఈ స్థలం మళ్ళీ ఎవరి పేరు మీదకు అక్రమ రిజిస్ట్రేషన్ కాకుండా కోర్టు ద్వారా చేర్యాల మున్సిపాలిటీకి అప్పగిస్తాను. బాధ్యత గల ఎమ్మెల్యే అయి ఉండి ఇటువంటి అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పు. నా తండ్రి ముత్తిరెడ్డికి ఎమ్మెల్యే అవకముందే వేలకోట్ల ఆస్తులు ఉన్నాయి.. నెలకు కోటిన్నర ఆదాయం కేవలం అద్దెల ద్వారానే వస్తుంది. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి పనులు చేయడం దారుణం.. చేర్యాల ప్రజలు నన్ను క్షమించండి” అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇక భవాని రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా సంచలనాన్ని కలిగిస్తున్నాయి. బాధ్యతగల ఎమ్మెల్యే ఉండి చెరువు మత్తడి స్థలాన్ని కబ్జా చేసి, రిజిస్ట్రేషన్ చేయడం ఏంటి అని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. గతంలో ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడు అనే ఆరోపణల మీద ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి కేసీఆర్ బర్త రఫ్ చేశారని.. ఇప్పుడు సాక్షాత్తు తన కూతురు ఆధారాలు చూపించినందున ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు