TTD Tickets in jio: తిరుమలేషుడు.. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. దేవదేవుడు.. కలియుగ ప్రత్యక్ష దైవం. అలాంటి దేవుడి దర్శనానికి నిత్యం లక్షలమంది భక్తులు వస్తుంటారు.ప్రపంచంలోనే అత్యంత రద్దీ గల దైవ క్షేత్రం తిరుమలనే. కోట్లకు పడగలెత్తిన స్వామి మన వేంకటేశ్వరుడు. అలాంటి దేవుడి దర్శనం, వసతి ఇప్పటికీ భక్తులకు ఎండమావే. అదో మిస్టరీ..

దర్శనం, వసతిని ఆన్ లైన్ చేసినా కూడా క్షణాల్లోనే అవన్నీ అయిపోతుంటాయి. టీటీడీ సర్వర్లన్నీ హ్యాంగ్ అయిపోతుంటాయి. ఈ సమస్యను పరిష్కరించాలని చాలా రోజులుగా టీటీడీ ప్రయత్నించినా వారి వల్ల కావడం లేదు. దీనికోసం ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ టీసీఎస్ సాంకేతిక సహకారాన్ని కూడా టీటీడీ కోట్లు పెట్టి తీసుకుంటోంది. అయినా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు.
ఈ క్రమంలోనే టీటీడీ వెబ్ సైట్ కు తరచూ సాంకేతిక సమస్యలు వచ్చి భక్తులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా తాజాగా దేశంలోనే కుబేరుడైన ముఖేష్ అంబానీ సహకారం అందించేందుకు ముందుకు వచ్చాడు. తిరుమల భక్తల కోసం ‘జియో యాప్’ను ఉచితంగా సేవలు అందించేందుకు రూపొందిస్తున్నారు. కోట్ల రూపాయలతో ఉచితంగా సాఫ్ట్ వేర్ ను రెడీ చేస్తున్నారు. ఈ మేరకు జియో యాప్ తో టీటీడీ ఒప్పందానికి రెడీ అయ్యింది.
ఇక నుంచి టీటీడీ వెబ్ సైట్ , యాప్ లో ఇక టికెట్ల బుకింగ్ ఉండదు. అంతా జియోమార్ట్ లోనే చేసుకోవాలి. ఉచితంగా ఇవ్వడం అంటే టీటీడీకి సర్వర్లను, సాంకేతికతను బలోపేతం చేయాలి. కానీ దాన్నుంచి లాగేసుకొని జియో మార్ట్ లో ఈ సేవలు అందించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ముసుగులోనే తమ వస్తువులు అమ్ముకోవడానికి జియోకు అవకాశం కల్పిస్తున్నారా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. టీటీడీ సేవలు జియోలో దొరకడం ఏంటని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.