
ఎగిరి దంచినా అంతే కైకిలి.. ఎగిరెగిరి దంచినా గంతే కైకిలి అనేది సామెత. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అసంతృప్తి సెగలు రగులుతూనే ఉన్నాయి. పార్టీలో సముచిత ప్రాధాన్యం దక్కలేదని చాలా మంది నేతలు అక్కసుతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడినా తగిన గుర్తింపు లేదని వాపోతున్నారు. పార్టీని పట్టుకుని వేలాడినా అంతే సంగతని పెదవి విరుస్తున్నారు.
తాజాగా మాజీ ఎంపీ, టీడీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి జగన్ పై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఒంగోలు ఎంపీ సీటు త్యాగం చేస్తే టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అది రెండేళ్లకే అయిపోయింది. దీంతో పదవీ కాలం పొడిగింపుపై ఏ రకమైన హామీ లేకపోవడంతో ఆయన కినుక వహించినట్లు తెలుస్తోంది.
టీటీడీ చైర్మన్ పదవి మళ్లీ ఆయనకేనని సంకేతాలు వస్తున్నా అందులో నిజం లేని ఆయన విశ్వసించడం లేదు. కేవలం కూల్ గా ఉంచడానికే ఇలాంటి వాటిని పుట్టిస్తున్నారని బలంగా నమ్ముతున్నారు. సుబ్బారెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని చెప్పడానికి ఈ రకమైన లీకులు వస్తున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చైర్మన్ ను ప్రకటించినా బోర్డును మాత్రం ఆలస్యంగా నియమించారు. దీంతో సుబ్బారెడ్డికి తక్కువ రోజులే దక్కాయి.
టీటీడీ చైర్మన్ పదవిని ఇప్పుడు క్షత్రియులకు ఇవ్వాలని సీఎం నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీంతో సుబ్బారెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటారోనని చర్చ అందరిలో నెలకొంది. సుబ్బారెడ్డిని సీఎం క్రమంగా దూరం పెడుతున్నారనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో బాలినేని-సుబ్బారెడ్డి వర్గాల మధ్య కొద్ది రోజులుగా సఖ్యత లేకుండా పోతోంది. దీంతో మొదట్లో సుబ్బారెడ్డి హవా కొనసాగినా మెల్లగా బాలినేనిదే పైచేయిగా మారుతోంది. దీంో సుబ్బారెడ్డి భవిష్యత్ పై సందిగ్ధం నెలకొంది.