TTD: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) నుంచి తాజాగా కీలక ప్రకటన వెలువడింది. శ్రీవారి ఆలయంలో అక్టోబర్ నెల 5వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేశారు. వచ్చే నెల 4వ తేదీన ఎలాంటి సిఫార్సు లేఖలను స్వీకరంచమని టీటీడీ వెల్లడించడం గమనార్హం. వచ్చే నెల 5వ తేదీన శ్రీవారి ఆలయంలో కోయిల్ అళ్వార్ తిరుమంజనం జరగనుంది. అక్టోబర్ నెల 6వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవలు వచ్చే నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనున్నాయి. కరోనా కేసులు పూర్తిస్థాయిలో తగ్గని నేపథ్యంలో ఈ ఏడాది కూడా ఏకాంతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని సమాచారం. టీటీడీ ఈవో జవహర్ రెడ్డి బ్రహ్మోత్సవాలలో ఎస్వీబీసీ హిందీ, కన్నడ ఛానెళ్లను మొదలుపెట్టడానికి ఎస్వీబీసీ ఏర్పాట్లు చేయాలని కోరారు. వసంత మండపంలో ప్రముఖ పండితులతో బ్రహ్మోత్సవాల వాహనసేవల వైశిష్ట్యం గురించి ఉపన్యాస కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని జవహర్ రెడ్డి సూచనలు చేశారు.
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లకు సంబంధించిన ఇంజనీరింగ్ పనులను సైతం వేగంగా పూర్తి చేయాలని జవహర్ రెడ్డి ఈవో అధికారులకు సూచనలు చేశారు. విశ్రాంతి గదులలో మాస్ క్లీనింగ్ చేపట్టడంతో పాటు మరమ్మత్తులు పూర్తైన కాటేజీలను భక్తులకు కేటాయించాలని జవహర్ రెడ్డి సూచించారు. తిరుమలకు వెళ్లే భక్తులు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిది. బ్రహ్మోత్సవాల విశేషాల విషయానికి వస్తే 7వ తేదీన ఉదయం ధ్వజారోహణం సాయంత్రం పెద్దశేష వాహనసేవ జరగనున్నాయి.
8వ తేదీన ఉదయం చిన్నశేష వాహనసేవ సాయంత్రం హంస వాహనసేవ జరగనున్నాయి. 9వ తేదీన ఉదయం సింహవాహన సేవ, సాయంత్రం ముత్యపు పందిరి వాహనసేవ జరగనున్నాయి. 10వ తేదీన ఉదయం కల్పవృక్ష వాహనసేవ, సాయంత్రం సర్వభూపాల వాహనసేవ జరగనున్నాయి. 11వ తేదీన ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం గరుడ వాహన సేవ జరగనున్నాయి.
12వ తేదీన ఉదయం హనుమంత వాహనసేవ, సాయంత్రం గజ వాహనసేవ జరగనున్నాయి. 13వ తేదీన ఉదయం సూర్యప్రభ వాహనసేవ, సాయంత్రం చంద్రప్రభ వాహనసేవ జరగనున్నాయి. 14వ తేదీన ఉదయం సర్వభూపాల వాహనసేవ, సాయంత్రం అశ్వ వాహన సేవ జరగనున్నాయి. 15వ తేదీన ఉదయం పల్లకీ ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం, సాయంత్రం ధ్వజారోహణం జరగనున్నాయి.