
WPL- Mumbai: ఉమెన్స్ టీ-20 ప్రీమియర్ లీగ్‌లో ముంబాయి జట్టు హవా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఈ జట్టు.. ఆదివారం ముంబాయి వేదికగా యూపీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో గెలుపొంది నాలుగో విజయాన్ని తన ఖతాలో వేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ జట్లు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ముంబాయి జట్టు 17.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టపోయి ఛేదించింది. ముంబాయి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (53: 33 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్)తో అర్థ సెంచరీ సాధించగా, ఈమెకు నాట్ సీవర్ (45 నాట్ ఔట్: 31 బంతుల్లో ఆరు ఫోర్లు, ఒక సిక్సర్) తోడవడంతో ముంబాయి జట్టు విజయం నల్లేరు మీద నడకయింది. ఓపెనర్ యాస్తికా భాటియా (42: 27 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్) దూకుడుగా ఆడారు. యూపీ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, సోఫీ ఎకిల్ స్టోన్ తలా ఒక వికెట్ తీశారు.
మొదట బ్యాటింగ్ చేసిన యూపీ జట్టు లో కెప్టెన్ అలీసా హీలే(58: 46 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్) మెరవగా, తాహిల్ మెక్ గ్రాత్ (50: 37 బంతుల్లో 9 ఫోర్లు) రాణించింది. దేవిక వైద్య(6), ఎకిల్ స్టోన్(1), దీప్తి శర్మ(6) విఫలమయ్యారు. కిరణ్ నవ్ గిరె(17: 14 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్) ధాటిగా ఆడే క్రమంలో ఔట్ అయింది. శ్వేత(2), సిమ్రాన్(9) నాట్‌ఔట్‌గా నిలిచారు. ముంబాయి బౌలర్లలో సైకా ఇషాక్ మూడు వికెట్లు పడగొట్టింది. అమేలియా కెర్ రెండు, మాథ్యూస్ ఒక వికెట్ పడగొట్టారు.

తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న యూపీ జట్టుకు ఓపెనర్లు మెరుగైన ఆరంభాన్ని ఇచ్చారు. ముంబాయి బౌలర్లను కాచుకుంటూ ధాటిగా పరుగులు చేశారు. ముఖ్యంగా హీలే దూకుడుగా ఆడింది. ఆమెకు తాహిల్ మెక్ గ్రాత్ తోడయింది. వీరిద్దరి ఆట తీరును చూసి యూపీ రెండు వందల స్కోరు సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే ముంబాయి బౌలర్లు మ్యాజిక్ చేశారు. సైకా ఇషాక్ దెబ్బకు హీలే, తాహిల్ ఔట్ కావడంతో యూపీ కష్టాలు మొదలయ్యాయి. మిడిల్ ఆర్డర్ కెర్ కు దాసోహం అవడంతో పరుగులు రావడమే గగనమైంది. దీనికి తోడు పేలవమైన షాట్లు ఆడటంతో ముంబాయి వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. దేవిక వైద్య(6), ఎకిల్ స్టోన్(1), దీప్తి శర్మ(6) వెంట వెంటనే ఔట్ కావడంతో యూపీ కష్టాల్లో పడింది. ఈక్రమంలో నవ్ గిరె క్రీజులోకి రావడం, 14 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి ధాటిగా ఆడే క్రమంలో ఔట్ అయింది. ఒక వేళ నవ్ గిరె క్రీజులో ఉండి ఉంటే యూపీ భారీ స్కోరు సాధించేది. తర్వాత వచ్చిన శ్వేత(2), సిమ్రాన్(9) స్కోరు సాధించడంతో యూపీ ఇన్నింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగుల వద్ద ముగిసింది. ఇక ఈ విజయంతో ముంబాయి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.