Trump Surrenders: భారత్, అమెరికా దేశాల మధ్య ఉన్న సంబంధాల విషయంలో కీలక మలుపు జరిగినట్లు తెలుస్తోంది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 50% సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ పన్నులతో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల సంఖ్య తగ్గిపోయింది. అయితే ఆ తర్వాత అమెరికాతో స్నేహం చేయడం.. చమురు పై ఒప్పందం చేసుకోవడం పై ట్రంపు పరోక్షంగా భారత్కు హెచ్చరికలు చేశారు. ఆ తర్వాత భారత్ అమెరికాను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అమెరికా ఒక మెట్టు దిగినట్లు తెలుస్తోంది. భారత్ తో న్యాయమైన ఒప్పందం చేసుకుంటామని స్వయానా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొనడం సంచలన విషయంగా మారింది.
భారత వస్తువులపై 2025 లో ఆగస్టు 1న 25% సుంకాలు పెంచారు. ఆ తర్వాత ఆగస్టు 27 నుంచి 50% అమలులోకి వచ్చింది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై 50 శాతం పన్నులు విధించడంతో అమెరికా, భారత్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత భారత్ కూడా అమెరికా ఉత్పత్తులపై సుంకాలను పెంచింది. అప్పటినుంచి వాణిజ్య యుద్ధం ప్రారంభమైంది. అయితే అంతకుముందు 2025 జూలైలో ట్రంప్ ఒక ప్రచార సభలో మాట్లాడుతూ.. భారత్ అమెరికా ఉత్పత్తులపై ఎక్కువ సుంకాలు వేస్తుందని అన్నారు. అందుకే మేము కూడా సుంకాలు పెంచుతున్నామని పేర్కొన్నారు. వాస్తవానికి భారత్ కంటే అమెరికాకు ఎక్కువగా వస్తువులు ఎగుమతి అవుతాయి. దీంతో భారత్ పైనే ఈ సుంకాల ప్రభావం ఎక్కువగా పడుతుంది.
ప్రధానంగా భారత్ నుంచి అల్యూమినియం, ఆటో పార్ట్స్, మెడిసిన్, వ్యవసాయ ఆధారిత వస్తువులు ఎగుమతి అవుతూ ఉంటాయి. అయితే ట్రంపు 50 శాతం పన్నులు విధించడంతో ఈ రంగాలపై తీవ్ర ప్రభావం పడింది. ఎగుమతులు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్ తమరు విషయంలో అమెరికాను కాదని రష్యాతో ఒప్పందం చేసుకున్నారు. సరసమైన ధరకే చమురు సరఫరా చేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. దీంతో భారత్, రష్యా మధ్య ఏర్పడిన బంధం పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేకపోయాడు. అప్పటినుంచి రకరకాల వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.
అయితే ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా.. భారత్ మాత్రం రష్యాతో పాటు చైనా తో కూడా మైత్రి బంధం కొనసాగించడం ప్రారంభించడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక అడుగు వెనక్కు వేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే వాణిజ్య ఒప్పందం పై చర్చలు ఉంటాయని ఇటీవల ఆయన స్వయంగా ప్రకటించారు.’మేము భారతదేశంతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. ఇది గతంలో చేసుకున్న దాని కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం వారు మమ్మల్ని ఆదరించడం లేదు. ఇకనుంచి వారు మాతో స్నేహం చేసే అవకాశం ఉంటుంది. మేము న్యాయమైన ఒప్పందం చేసుకుంటాం’అని తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.