హుజురాబాద్ లో ఉప ఎన్నికల వాతావరణం జోరందుకుంది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకటించడంతో పార్టీల ప్రచారం ఊపందుకుంటోంది. ఇప్పటికే పలు మార్గాల్లో ప్రత్యర్థి పార్టీపై దాడి చేసే క్రమంలో పలు విధాలుగా ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఫేక్ స్టేటస్ లతో ఓటర్లను పక్కదారి పట్టించేందుకు అధికార పార్టీ కుయుక్తులు పన్నుతోంది. ఇప్పటికే గతంలోనే ఈటలపై పలు రకాలుగా ఫేక్ స్టేటస్ లు పెట్టి ఓటర్ల మనసు మార్చాలని భావిస్తోంది. దీంతో టీఆర్ఎస్ తీరుపై బహిరంగంగానే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దళితబంధు పథకంపై టీఆర్ఎస్ మరో ఫేక్ స్టేటస్ పెట్టింది. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఈటల రాజేందర్ దళితబంధు పథకం ఆపాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఓ లేఖ విడుదల చేసింది. దీంతో దీనిపై పలు రకాల ఆరోపణలు వస్తున్నాయి. దళితుల అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి విధంగా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈటలను ఈ ఉప ఎన్నికలో చిత్తుగా ఓడించాలని కోరారు.
ఇలా దళితబంధు పథకం పేరుతో అబద్దపు లేఖ సృష్టించి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. ఫేక్ లేఖలు పుట్టించడం వెనుక ఉన్న కుట్రల గురించి పలు రకాల వార్తలు వెలుగు చూస్తున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఫేక్ పోస్టులతోనే ఎక్కువ ప్రయోజనాలు పొందాలని అధికార పార్టీ భావిస్తోంది. ఈటలకు వ్యతిరేకంగా ధర్నాలు చేయడం కామనే అయినా ఇలా చిల్లర రాజకీయాలు చేయడం ఏమిటని ఈటల ప్రశ్నిస్తున్నారు.
సామాజిక మాధ్యమాలనే వేదికగా చేసుకుని ఫేక్ ప్రచారాలు పెరిగిపోతున్నాయి. పాత వీడియోలనే ప్రస్తుత వాటిగా వక్రీకరించి పబ్బం గడుపుతున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఇలా ఫేక్ పోస్టులతో ప్రత్యర్థి పార్టీని ఇరుకున పెట్టాలని చూస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీపై లేనిపోని విధంగా పోస్టులు పెడుతూ ఓట్లు రాబట్టుకోవాలని భావిస్తోంది.
