Rice scam: తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ గట్టి పోటీనిస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో స్థానిక బీజేపీ నేతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తున్నారు. టీఆర్ఎస్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్ తో బీజేపీ నేతలు తగ్గెదేలే అన్నట్లు గా వ్యవహరిస్తుండంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ మొదలైంది.
బీజేపీ తెలంగాణలో క్రమంగా బలపడుతుండటంతో టీఆర్ఎస్ అలర్ట్ అవుతోంది. స్థానిక బీజేపీ నేతలతోపాటు కేంద్రంలోని బీజేపీ సర్కారును సీఎం కేసీఆర్ కొద్దిరోజులుగా టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా రైతుల విషయంలో బీజేపీని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయలేదనే ఆరోపణలను గుప్పిస్తున్నారు. పంజాబ్ లో రైతులు పండించిన ధాన్యం మొత్తం కేంద్రం కొనుగోలు చేస్తుందని తెలంగాణలో ఎందుకు కొనరంటూ ప్రశ్నిస్తున్నారు.
పార్లమెంటులోనే టీఆర్ఎస్ ఎంపీలు ఇదే విషయంపై కేంద్రాన్ని నిలదీసే ప్రయత్నం చేశారు. ఈక్రమంలోనే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ సర్కారుకు దిమ్మతిరిగిపోయే సమాధానాన్ని ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం 60లక్షల క్వింటాళ్ల ధాన్యం ఎఫ్సీఐకి ఇస్తుందని చెప్పిందని కానీ అందులో సగం కూడా ఇప్పటి వరకు అప్పగించలేదన్నారు. రబీలో ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం ముందుగా ఎఫ్సీఐకి అప్పగించిన తర్వాత యాసంగి గురించి మాట్లాడాలంటూ సీఎం కేసీఆర్ కు ఆయన చురకలంటించారు.
Also Read: మిషన్-2023.. బీజేపీలోకి ఉద్యమ నేతలు.. చేరికలతో బీజీబీజీ..!
ఈక్రమంలోనే బియ్యం కొనుగోళ్ల విషయంలో పలు అవకతవకలు జరిగినట్లు స్థానిక బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. ఈ విషయంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కేంద్రం చెప్పిన లెక్కలను బట్టి తెలంగాణ ప్రభుత్వం తక్కువ ధాన్యం సేకరించి ఎక్కువగా చూపించిందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి టీఆర్ఎస్ నేతలు ధాన్యాన్ని స్మగ్లింగ్ చేసి ఎఫ్సీఐకి అమ్ముకొని కోట్లు గడిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇటీవల కాలంలో బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ అరెస్టు కావడం ఖాయమంటూ ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. దీంతో తెలంగాణలో బియ్యం కొనుగోళ్ల స్కామ్ వెలుగులోకి వస్తుందా? అనే సస్పెన్స్ నెలకొంది. ఇదే కనుక జరిగితే టీఆర్ఎస్ సర్కారు అప్రతిష్టపాలు కావడం ఖాయంగా కన్పిస్తుంది. మరీ స్థానిక బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నట్లుగా Rice Scam వెలుగులోకి వస్తుందా? లేదంటే ఆరోపణలకే పరిమితం అవుతుందా? అనేది మాత్రం వేచిచూడాల్సిందే..!
Also Read: తెలంగాణలో బీజేపీ సెల్ఫ్ గోల్ వేసుకుంటోందా?