Huzurabad Bypoll: హుజురాబాద్ ఉప ఎన్నికలో పార్టీల ప్రచార హోరు పెరిగింది. ఎన్నిక తేదీ దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల ప్రచార జోరు పెంచుతున్నాయి. ప్రధానంగా రెండు పార్టీల మధ్యే పోటీ నెలకొంది. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు విజయం కోసం శ్రమిస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యర్థి పార్టీపై విమర్శలకు పదును పెడుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పావులు కదుపుతున్నాయి.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై పన్నుల భారం మోపుతోందని తద్వారా ధరల పెరుగుదలతో సామాన్యుడి నడ్డి విరుస్తుందని టీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. గ్యాస్ సిలిండర్లు పెట్టి మరీ తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న ధరలతో బతుకు కష్టంగా మారిందని చెబుతోంది. బతుకమ్మ పండుగలో కూడా గ్యాస్ సిలిండర్ పెట్టి కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న గ్యాస్ ధరను హైలెట్ చేస్తూ నిందించేందుకు టీఆర్ఎస్ ముందుకు పోతోంది.
దీనిపై బీజేపీ నాయకులు ఖండించడం లేదు. రాష్ర్టప్రభుత్వ ఆరోపణలను తోసిపుచ్చడం లేదు. దీంతో అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు హుజురాబాద్ లో ఏం జరుగుతోంది అని ఆలోచనలో పడుతున్నారు. బీజేపీ మదిలో ఏముందని తర్జనభర్జన పడుతున్నారు. టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నలు వస్తున్నాయి.
కేంద్రం పెట్రో, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతూ దీన్ని చూపిస్తూ ప్రజలు బీజేపీకి ఓటు వేయొద్దని మంత్రి హరీశ్ రావు చెబుతున్నారు. బీజేపీకి ఓటు వేస్తే ధరలు మరింత పెరుగుతాయని ప్రజలకు సూచిస్తున్నారు. దీనిపై ఇప్పటివరకు మాజీ ఈటల రాజేందర్ మాత్రం స్పందించి గ్యాస్ ధరలో రూ.291 రాష్ర్ట ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పడంతో హరీశ్ రావు ఇది నిజమని నిరూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని సవాలు విసిరారు.
కానీ దీనిపై ఈటల స్పందించలేదు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంతో బీజేపీకి కష్టాలు తప్పేలా కనిపించడం లేదని పలువురు పేర్కొంటున్నారు. గ్యాస్ సిలిండర్ ధరతో ప్రయోజనం పొందాలని టీఆర్ఎస్ భావిస్తున్నా బీజేపీ మాత్రం ఏ ఆయుధం తీసుకుంటుందో ఇంకా తెలియడం లేదు.