TRS vs BJP: తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్లింది. అధికారంలోకి రాగానే బలమైన కాంగ్రెస్ ను నీరుగార్చింది. ఆ పార్టీలోని కీలక నేతలకు గులాబీ కండువా కప్పేసి, పదవులు ఇచ్చేసి కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసింది. ఇక తమకు ఎదురే లేదు అని అనుకుంటున్న సమయంలో బీజేపీ వచ్చింది. బండి సంజయ్ వచ్చాక ఆ ఊపుకు బీజేపీకి ఊపిరివచ్చింది. ఏకపక్షంగా సాగుతున్న తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీ బలంగా తయారై బలమైన ప్రతిపక్షంగా నిలిచింది.

అయితే తెలంగాణ కాంగ్రెస్ దాదాపు చచ్చుబడి పోయిందనుకుంటున్నసమయంలో టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం ఆపార్టీకి ఊపిరి పోసింది. రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో కలుపుతానన్న కేసీఆర్ మాట తప్పాడు. ఆ తర్వాత 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడంతో హస్తం పార్టీకి మరోసారి దెబ్బతగిలింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కొట్లాటల వల్ల ప్రభుత్వం విధానాలను ప్రశ్నించడంలో విఫలమైంది.. పార్టీ పదవుల కొట్లాటలో తెలంగాణలో కాంగ్రెస్ ఉనికిని కోల్పోతున్న సందర్భంలో ఏడున్నర ఏళ్ల తరువాత రేవంత్ రెడ్డిని టీపీసీసీ ప్రెసిడెంట్ గా నియమించారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం ఉత్తేజం నిండింది. రేవంత్ రెడ్డి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీలో చాలా మార్పులు సంభవించాయి. సీనియర్ నాయకులను కలుపుకుని వెళ్లడంలో రేవంత్ రెడ్డి ఒకింత సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.
రేవంత్ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా హుజురాబాద్ ఉప పోరు జరిగింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ ఓటమి పాలయ్యారు. దీంతో అప్పటికే రేవంత్ పై వ్యతిరేక గళం వినిపిస్తున్న సీనియర్ నాయకులకు మంచి అవకాశంగా దొరికినట్టయింది. దీంతో రేవంత్ నాయకత్వంపై కాంగ్రెస్ అధినాయకత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి.. మరో పక్క రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా సాగుతున్న వరి కొనుగోలు కొట్లాటతో కాంగ్రెస్‌ను ఎవరు పట్టించుకోవడం లేదు. మున్ముందు కూడా ఇదే పరిస్థితులు కొనసాగితే హస్తం పార్టీకి తీవ్ర ఇబ్బందులు తప్పవనే అంటున్నారు విశ్లేషకులు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వరి కొనుగోలు విషయంలో దోషులుగా చూపి ప్రజలను తమ వైపు తిప్పుకునే మంచి అవకాశం కాంగ్రెస్ పార్టీకి దొరికిందనే చెప్పాలి. మరి ఈ రెండు ప్రభుత్వాలకు విధానాలను నిరసిస్తూ గురువారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా పబ్లిక్ గార్డెన్ నుంచి వ్యవసాయ కమిషనరేట్ వరకు కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించింది. రేవంత్ రెడ్డి స్వయంగా ఈ ర్యాలీని ముందుకు నడిపించి బీజేపీ, టీఆర్ఎస్ ల తీరును ఎండగట్టారు. ఈ రెండు పార్టీలు తోడు దొంగలు అని నిరూపించాడు. మరోవైపు టీఆర్ఎస్ మహా ధర్నా కూడా ఇదే రోజు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానికి అంతగా ప్రాధాన్యత దక్కలేదు. పైగా కేసీఆర్ ధర్నాలో కూర్చోవడంతో కాంగ్రెస్ నిరసన తేలిపోయింది. తాజా పరిణామాలతో కాంగ్రెస్ బలం పుంజుకుంటుందా లేదా బీజేపీ, టీఆర్ఎస్ కొట్లాటలో కాంగ్రెస్ స్వయం తప్పిదాలతో కొట్టుకుపోతుందా అనే చర్చ మొదలయింది.
Also Read: KCR vs BJP: బీజేపీని కొట్టేయాలి.. కేసీఆర్ కేబినెట్ విస్తరణ వెనుక భారీ ప్లాన్?
ఒకవేళ వరి ధాన్యం కొనుగోలు కొట్లాట కాంగ్రెస్‌కు అనుకూలంగా మారితే టీఆర్ఎస్, బీజేపీలకు ఇబ్బందే.. కాంగ్రెస్ పుంజుకుంటే సీఎం కేసీఆర్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారు.? అసలు కాంగ్రెస్ అంతవరకు ఎదుగుతుందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉందనే చెప్పాలి. దానికి తోడు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ ఉండడం.. బాహాటంగానే పార్టీలోని నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. ఇవన్ని కలిసి కాంగ్రెస్‌కు మైనస్‌గా మారుతున్నాయి. ఇప్పటికైనా హస్తం పార్టీ కి రాష్ట్రంలో పునర్‌వైభవం రావాలంటే ఇదే అదనుగా చూసుకుని వ్యూహాలు రచించాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉండడంతో కారు పార్టీ, కమలం పార్టీ ని ఎదుర్కొనేందుకు ప్రణాళికలకు పదును పెడుతారా లేదా ఎలా ముందుకు వెళ్లారు అనేది భవిష్యత్తులో తేలనుంది.
Also Read: KCR: కేంద్రప్రభుత్వాన్ని వదలా..18న మహాధర్నా.. కేసీఆర్ సంచలనం