Telangana Assembly Sessions: అసెంబ్లీ సమావేశాల సాక్షిగా రెండు పార్టీలు ఒక్కటైనట్లు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షం అంటే అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులు ఎండగట్టడంలో ముందుంటుంది. కానీ ఇక్కడ వారి మధ్య అక్రమ సంబంధం ఉన్నదన్న విధంగా ఇరు పార్టీలు కలిసిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎక్కడైనా అధికార పార్టీని విమర్శించడం మామూలే. కానీ కేంద్ర ప్రభుత్వంపై అసెంబ్లీలో విమర్శలు చేసి అందరిలో అనుమానాలు కలిగిస్తున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడనే వాదనను రుజువు చేస్తున్నారు. వారి అధ్యక్షుడేమో రాష్ర్ట ప్రభుత్వాన్ని విమర్శించాలని చెబుతున్నా సభలో మరో విధంగా జరగడం అందరిలో సంశయాలు పెంచుతున్నాయి.

వర్షాకాల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ టీఆర్ఎస్ కాళ్లకు అడుగులు మడుగులొత్తుతోంది. ఒక్క మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మినహా మిగిలిన నలుగురు టీఆర్ఎస్ కు వంత పాడటం ఆందోళన కలిగించింది. ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వంపై రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసేందుకు అసెంబ్లీని వాడుకోవడం అందరిలో అనుమానాలకు ఆస్కారం కలిగిస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరని దీంతో తెలిసిపోతోంది.
తెలంగాణలో అధికార పార్టీ చేస్తున్న ఆగడాలకు ముక్కుతాడు వేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సూచించినా లోపల జరిగిన తతంగం అందరిలో ప్రశ్నలు వచ్చేలా చేసింది. కాంగ్రెస్ పార్టీ మెల్లమెల్లగా టీఆర్ఎస్ తొత్తుగా మారుతోంది. భవిష్యత్ లో కూడా రెండు పార్టీలు చెట్టాపట్టాలేసుకుని పోవడం ఖాయంగా కనిపిస్తోంది. గత అసెంబ్లీ లో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్కను పొగుడుతూ మాట్లాడటంతోనే అప్పట్లోనే అనుమానాలు వచ్చాయి. ఇద్దరి మధ్య సమన్వయం కుదరడంతోనే ఇలా జరుగుతోందని చెబుతున్నారు.
ఇక ప్రస్తుత అసెంబ్లీలో భట్టికి ఏకంగా గంట నలభై నిమిషాలు మాట్లాడటానికి అనుమతి ఇవ్వడం చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వారించే ప్రయత్నం చేసినా కేసీఆర్ సైగలు చేయడంతో వారు కూడా మాట్లాడలేదు. దీంతో రెండు పార్టీల మధ్య సఖ్యత ఏర్పడుతోందని చెబుతున్నారు. మరోవైపు ఢిల్లీ నేతలేమో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే రాష్ట్ర నేతలేమో టీఆర్ఎస్ కు అనుకూలంగా మాట్లాడటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపి వారిని సరైన దారిలో నడవాలని సూచించాల్సి ఉన్నా వారు ఎందుకు అధికార పార్టీ కొమ్ముకాస్తున్నారు. ఇక అధికారం మాకు దక్కదనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ తో జత కట్టేందుకు సిద్ధపడుతున్నారా అనేది అంతు చిక్కడం లేదు. కానీ బీజేపీపై కోపంతో గులాబీ పార్టీకి మద్దతుగా నిలుస్తున్తున్నారా? అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికే బీజేపీ కాంగ్రెస్, టీఆర్ఎస్ ఒక్కటేనని విమర్శలు చేస్తుంటే కాదని ఖండిస్తూ సభలో మాత్రం టీఆర్ఎస్ తో అంటకాగేందుకు ప్రయత్నించడం విమర్శలకు తావిస్తోంది.
భట్టి మాట్లాడుతున్నంత సేపు అధికార పార్టీని ప్రశంసించేందుకు సమయం తీసుకోవడం విశేషం. ఎక్కడైనా అధికార పార్టీని విమర్శించే ప్రతిపక్షం ఉంటుంది కానీ పొగిడే ప్రతిపక్షం ఇక్కడే చూస్తున్నాం. దీనికి బదులు వారు కూడా టీఆర్ఎస్ కండువాలు వేసుకుంటే ఇక ఏ గొడవ ఉండదు కదా అనే విమర్శలు సైతం వస్తున్నాయి. భట్టిలో ఎప్పటి నుంచో అధికార పార్టీపై ప్రేమ పెరుగుతోంది. ఖమ్మంలో దళితబంధు అమలు చేసేందుకు కొన్ని గ్రామాలు ఎంపిక చేసినప్పుడే ఆయన ప్రభుత్వం వైపు తిరుగుతున్నారనే వాదన కూడా వస్తోంది. మొత్తానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటి కావడం ఖాయమనే వార్తలుకూడా హల్ చల్ చేస్తున్నాయి.