హరీష్ రావుకు సిద్దిపేట జిల్లాపై పూర్తిస్థాయిలో పట్టు ఉంది. ఆయన్ను రంగలోకి దింపింతేనే విజయం సాధ్యమవుతుందనే ఆలోచనలో టీఆర్‌ఎస్ పార్టీ ఉంది. అందుకే ఈ భారమంతా హరీష్ నెత్తిన మోపారు. దీంతో హరీష్ కూడా రంగంలోకి దిగారు. పర్యటనలు చేస్తూ.. హామీలు ఇస్తూ.. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.తాజాగా సిద్దిపేట జిల్లా రాయపోలు మండల కేంద్రంలో రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు, వర్షాలకు కూలిన ఇళ్లకు నష్టపరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీటర్లు కావాలంటే మీరంతా బీజేపీకి ఓటు వేయాలని.. మీటర్లు వద్దనుకుంటే కారుకు ఓటు వేయాలని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ నిరంతరం రైతుల సంక్షేమం కోసమే పనిచేస్తోందని, బీజేపీ మాత్రం రైతులకు మేలు చేయకపోగా, వారిపై బాంబులు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందంటూ విమర్శించారు.
అంతేకాదు.. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి కలెక్టర్లతో బిల్లులు వసూళ్లు చేస్తామని చెబుతున్నారని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్రం వ్యవసాయ విద్యుత్‌కు మీటర్లు బిగించే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ అంగీకారం తెలపగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో మీటర్ల వ్యవహారాన్ని హైలెట్ చేసి బీజేపీ గట్టి షాక్ ఇవ్వాలని టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వెళ్తోంది. ప్రధానంగా ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూ, రైతుల్లో బీజేపీపై వ్యతిరేకత పెరిగేలా చేస్తున్నారు. హరీష్ చేసిన ఈ వ్యాఖ్యలు అటు రైతులనూ ఆలోచనలో పడేశాయి. ఇప్పటికే బీజేపీ క్యాండిడేట్ రఘునందన్‌రావు సింపతి ఓట్లపై ఆశలు పెట్టుకోగా.. ఇప్పుడు ఈ హరీష్ వ్యాఖ్యలు కొంప ముంచుతాయా.. గెలుపును ప్రసాదిస్తాయా చూడాలి మరి.