అడకత్తెరలో చిక్కిన పోకచెక్కలా మారింది ప్రధాని పరిస్థితి. బీహార్ లో లోక్ జనశక్తి పార్టీలో పుట్టిన ముసలం ఇపుడు మోడీ మెడకు చుట్టుకుంది. దీంతో ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. బాబాయ్ అబ్బాయ్ మధ్య ఇరుక్కున్నారు. తాజా రాజకీయ పరిణామాల్లో ఎల్జేపీ నిట్టనిలువునా చీలిపోయింది. దివంగత కేంద్ర మంత్రి, ఎల్జేపీ అధ్యక్షుడు రాంవిలాస్ పాశ్వాన్ కొడుకు చిరాగ్ పాశ్వాన్ ను దించేసి సొంత చిన్నాన్న పశుపతి కుమార్ షరాన్ అధ్యక్షుడయ్యాడు.
పార్టీకి ఉన్న ఆరుగురు ఎంపీల్లో ఐదుగురిని పశుపతి తన దగ్గర పెట్టుకున్నారు. దీంతో తనదే అసలైన పార్టీ అని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ప్రకటించుకున్నారు. దీంతో చిరాగ్ ఒంటరైపోయారు. తండ్రి చనిపోయిన తరువాత పార్టీ పగ్గాలు చేపట్టిన చిరాగ్ ఒంటెత్తు పోకడలతోనే పార్టీలో అసంతృప్తి జ్వాలలు రేగాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఇపుడు మోడీకి అసలు చిక్కు ఎదురైంది. ఐదుగురు ఎంపీలున్న తమదే అసలైన పార్టీ అని పశుపతి అంటుంటే మరోవైపు చిరకాల మిత్రుడైన పాశ్వాన్ కుమారుడు చిరాగ్ తమదే అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మోడీ ఎవరికి మద్దతు తెలపాలనే దానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ధర్మం ప్రకారం చూసుకుంటే చిరాగ్ వైపు, న్యాయం కోసం చూస్తే పశుపతి వైపు మొగ్గు చూపాలి. కానీ ప్రస్తుతం మోడీ ఎవరికి మద్దతు ఇస్తారనే దానిపైనే అందరి దృష్టి పడింది.
దేశంలో బీజేపీ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది. పార్టీపై వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఎవరి పక్షం వహిస్తారనే దాని మీద ఉత్కంఠ నెలకొంది. పశ్చిమ బెంగాల్ లో ఓటమితో పార్టీ చావుదెబ్బ తిన్నది. వచ్చే ఏడాది ఐదు రాష్ర్టాల ఎన్నికలు జరగనున్న సందర్భంలో ఎంపీల బలాన్ని పోగొట్టుకోవడానికి ప్రధాని సిద్ధంగా లేరనే విషయం తెలుస్తోంది.