AP Trainee SI: విజయనగరం జిల్లా కేంద్రంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఓ మహిళా ఎస్సై ఆత్మహత్య ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఐదు రోజుల క్రితం శిక్షణ నిమిత్తం ఆమె ఇక్కడికి వచ్చారు. శనివారంతో శిక్షణ పూర్తయ్యింది. ఆదివారం ఆమె తిరిగి వెళ్లిపోవాల్సి ఉంది. పెళ్లి కూడా కాని యువ ఎస్సై పీటీసీ కాలేజీ హాస్టల్ లో ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది.
2018 బ్యాచ్ కు చెందిన ఎస్సై భవానీకి ఇటీవలే తూర్పు గోదావరి జిల్లాలోని సఖినేటి పల్లిలో అడిషనల్ ఎస్సైగా మొదటి పోస్టింగ్ దక్కింది. రాజోలు పోలీస్ స్టేషన్ లో ట్రైనింగ్ అనంతరం ఆమెకు ఈ పోస్టింగ్ లభించింది. ఎస్సైగా నియమించడంతో క్రైమ్ శిక్షణ నిమిత్తం ఆమె ఐదురోజుల క్రితం విజయనగరంలోని పీటీసీకి వచ్చారు.
శనివారంతో ట్రైనింగ్ ముగియగా.. ఆదివారం భవానీ తిరిగి సఖినేటిపల్లి వెళ్లాల్సి ఉంది. కానీ ఇంతలోనే హాస్టల్ గదిలోని ఫ్యాన్ కు ఉరివేసుకొని చనిపోయారు. అర్థరాత్రి సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. భవానీ ఆత్మహత్యకు అసలు కారణాలు ఏంటన్నది తెలియరాలేదు.
భవానీ స్వస్థలం కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెంపాలెం గ్రామం. ఇంకా పెళ్లి కాలేదు. రైతుకుటుంబానికి చెందిన భవానీ కష్టపడి చదివి ఎస్సై జాబ్ సాధించారు. ఆ పోస్టులో చేరిన కొద్దిరోజులకే ఆత్మహత్యకు పాల్పడడం అనుమానాలకు తావిస్తోంది. చివరిసారిగా విశాఖపట్నంలో ఉన్న సోదరుడు శివతో ఫోన్ లో మాట్లాడినట్టు గుర్తించారు. శిక్షణ పూర్తయ్యిందని చెప్పేందుకే ఫోన్ చేసినట్లు సమాచారం.
భవానీ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని.. దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని విజయనగరం డీఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణం అయ్యి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నిజనిజాలు తెలియాల్సి ఉంది.
గతంలోనూ ఏపీ పోలీస్ శాఖలో గుంటూరు జిల్లా చుండూరు ఎస్సై పిల్లి శ్రావణి ఆత్మహత్య కేసులో రాష్ట్రంలో సంచలనమైంది. గత ఏడాది మేలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. నాటి చుండూరు సీఐ వేధింపులే ఆమె ఆత్మహత్యకు కారణంగా చనిపోతూ శ్రావణి తన వాంగ్మూలంలో పేర్కొంది. ప్రస్తుతం భవానీ ఆత్మహత్య వ్యవహారం ఏపీ పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది.