Badvel Bypoll: కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో వైసీపీకి గట్టి పోటీ ఎదురవబోతోంది. ఇన్నాళ్లు ఎలాగూ ఏకగ్రీవమే కదా అంటూ కూల్ గా ఉన్న వైసీపీ నేతలను షాకింగ్ న్యూస్ దిమ్మతిరిగేలా చేసింది. ఇక్కడి శాసన సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ బరిలో నిలవాలని డిసైడ్ అయ్యాయి. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే దాసరి వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేలుకు ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఆయన సతీమణి దాసరి సుధను వైసీపీ అధిష్టానం పోటీలో నిలపాలని నిర్ణయం తీసుకుంది. నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఎలాగూ సెంటిమెంటు ప్రకారం.. ప్రజాప్రతినిధి చనిపోయినచోట పోటీ లేకుండా.. అతడి కుటుంబంలో ఒకరిని ఏకగ్రీవం చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే క్రమంలో వైసీపీ కూడా ఈ ఉప ఎన్నికను పెద్దగా రిస్క్ తీసుకోవద్దని అనుకుంది. అయితే బీజేపీ, కాంగ్రెస్ లు వైసీపీకి పెద్ద షాక్ ఇచ్చాయి. తాము బరిలో ఉంటున్నట్లు ప్రకటించేశాయి.

దీంతో కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికకు ఏకగ్రీవం అవకాశం లేకుండా పోయింది. కాంగ్రెస్ తరఫున మాజీ ఎమ్మెల్యే కనుమలమ్మను అభ్యర్థిగా ఖరారు చేశారు. బీజేపీ నుంచి కూడా మాజీ ఎమ్మెల్యే జయరాములును బరిలో నిలుపుతున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని నేడో.. రేపో ఖరారు చేయనున్నారు. నామినేషన్లకు కూడా సమయంలో ఈ నెల 8వ తేదీ ఆఖరు. ఈ నేపథ్యంలో ఈ లోపే అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో బద్వేలు ఉప ఎన్నిక ఏకగ్రీవంపై వైసీపీ ఆశలు అడియాశలయ్యాయి.
అయితే.. సంప్రదాయం అంటూ.. టీడీపీ, జనసేన పోటీకి దూరంగా ఉన్నాయి. భారతీయ జనతాపార్టీ ఈ ఎన్నికల్లో పోటీచేసినా.. జనసేన మద్దతు ఇవ్వడం సాధ్యం కాదు. ఎందుకంటే.. పవన్ కల్యాణ్ వైసీపీ అభ్యర్థి సుధకే మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. దివంగత నేత భార్య కాబట్టి.. పోటీ చేయడం లేదని చెబుతూ.. నేరుగా మద్దతు ఇస్తున్నారు. ఈ క్రమంలో మిత్రపక్షమైన బీజేపీ పోటీ చేస్తున్నా.. పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వడం లేదు. అయితే తాము అభ్యర్థిని ఖరారు చేసిన తరువాత వపన్ కల్యాణ్ ను కలిసి మద్దతు అడుగుతామని సోము వీర్రాజు చెబుతున్నారు.
ఈ క్రమంలో వైసీపీ అంతర్మథనంలో పడింది. ఏకగ్రీవం అనుకుంటే.. మరో రెండు పార్టీలు పోటీ చేస్తుండడంతో తప్పనిసరిగా వ్యూహాలు సిద్ధం చేయాలని అనుకుంటోంది. పెద్దగా పోటీ ఉండదని భావిస్తునే.. అంచనాలను ఎప్పుడూ తక్కువ చూడొద్దని అనుకుంటోంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఉప ఎన్నికకు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. వైసీపీ గెలపుకోసం కార్యకర్తలు కష్టపడాలని సూచిస్తున్నారు. త్రిముఖ పోటీ ఉండనున్న నేపథ్యంలో కనీసం లక్ష మెజారిటీ అయినా సాధించాలని అనుకుంటున్నారు. ఇప్పటికే సుధ నామినేషన్ వేయగా.. ప్రచారం కూడా ప్రారంభించారు. ఓట్ల మెజారిటే లక్ష్యంగా పనిచేయాలని సజ్జల నేతలకు చెబుతున్నారు. 2015లో తిరుపతిలో టీడీపీ ఎమ్మెల్యే మరణించడంతో వైసీపీ అక్కడ పోటీకి దిగలేదు. ఇండిపెండెంట్ అభ్యర్థి బరిలో నిలవడంతో టీడీపీ అభ్యర్థికి లక్షకు పైగా మెజారిటీ వచ్చింది. ఆ మార్కు దాటాలని సజ్జల చెబుతున్నారు. బద్వేలులో మొత్తం.. 2లక్షలకు పైగా ఓటర్లుఉండగా.. సగానికి పైగా వైసీపీ కి పడాలని దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ నెల 30న ఇక్కడ పోలింగ్ ఉండగా.. రెండున ఫలితాలు వెలువడనున్నాయి.