
Russia-US conflict : ఇది తెలిసిన సామెతే. ఆవులు, ఆవులూ పోట్లాడుకుంటే మధ్యలో విరిగేది లేగల కాళ్ళే. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇక ఇప్పుడు ఇదే తరహాలో అమెరికా, రష్యా ఢీకొంటున్నాయి.. ఫలితంగా ఒక దేశం మీద మరొక దేశం ఆంక్షలు విధించుకుంటున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.. వాస్తవానికి నాటో దేశాలు గెలకడం ద్వారానే రష్యా , ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగింది. అప్పటిదాకా ఉక్రెయిన్ కు వత్తాసు పలికిన అమెరికా, యూరో దేశాలు తర్వాత వెనుకడుగేశాయి.. దీంతో రష్యా, ఉక్రెయిన్ పై రెచ్చిపోయింది.. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం కలిగించింది.. అయినప్పటికీ ఉక్రెయిన్ వెన్ను చూపించలేదు. ఈ క్రమంలో తన మాట కాదని యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికా ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షలకు కూడా ఏడాది గడిచిపోయింది.. ఇప్పుడు కొత్తగా మరిన్ని ప్రతిపాదించి ఆ ఆంక్షలను సవరించింది.
దీనిపై రష్యా కూడా అగ్గి మీద గుగ్గిలం అవుతున్నది. ఒకరకంగా చెప్పాలంటే రష్యా మీదే యూరప్, అమెరికా దేశాలు ఆధారపడ్డాయి. ఇంధనం, ఆహార ఉత్పత్తులు, యుద్ధ విమానాలకు వాడే ముడి సరుకు రష్యా నుంచే ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. పైగా రష్యాలో అమెరికాకు చెందిన వివిధ కంపెనీలు 150 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టాయి. యూరప్ జోన్ లో ఉన్న దేశాలు కూడా అదే స్థాయిలో పెట్టుబడులు పెట్టాయి. ప్రస్తుతం అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు రష్యా ఆసియాలో బలమైన చైనా, ఇండియాతో స్నేహం కొనసాగిస్తోంది. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకుంటున్నది.
ఇప్పటికే ఇండియాకు అత్యంత చౌక ధరకు ముడిచమురును సరఫరా చేస్తోంది. ఉక్రెయిన్ పై యుద్ధానికి ముందు రష్యా సరఫరా చేసే ముడి చమురే అమెరికా, యూరప్ దేశాలకు ఆధారం. కానీ ఇప్పుడు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ దేశాలకు సరఫరా చేసే ముడి చమురును భారతదేశానికి విక్రయిస్తోంది.. మరోవైపు ఇరాన్ కూడా ఈ ముడి చమురును తమ దేశానికి చెందిన సముద్ర జలాల ద్వారా తరలించుకోవచ్చని భారత్ కు ఆఫర్ కూడా ఇచ్చింది.. దీంతో భారత్ ముడి చమురును తన దేశానికి దిగుమతి చేసుకొని, శుద్ధి చేసిన అనంతరం దానిని అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేస్తోంది..
ఇక అమెరికా ఆంక్షలకు రష్యా ఏమాత్రం బెదరడం లేదు. పైగా అమెరికా గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేలా అడుగులు వేస్తోంది..పుతిన్ కూడా “అమెరికా పెత్తనం ప్రపంచం మీద ఇంకా ఎన్ని రోజులని” ప్రశ్నిస్తున్నాడు.. అటు చైనా కూడా అమెరికా మీద గరంగరంగా ఉంది.. మరోవైపు యూరో జోన్ లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు..చూడబోతే ఉక్రెయిన్ యుద్ధం రష్యాను మళ్ళీ ప్రపంచం నంబర్ వన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుతిన్ అడుగులు కూడా అందుకు అనుగుణంగానే పడుతున్నాయి.ఎంకి పెళ్ళి సుబ్బి చావుకి వచ్చినట్టు ఉక్రెయిన్ యుద్ధం అమెరికా మొదటి స్థానానికి ఎసరు పెట్టేలా ఉంది.