https://oktelugu.com/

Balagam Movie : సిరిసిల్ల ‘బలగం’.. సరికొత్త ప్రయోగం!

Balagam Movie : సిరిసిల్ల అనగానే తెలంగాణలో అందరికీ గుర్తొచ్చేది చేనేత క్షేత్రం. పద్మశాలీ సామాజికవర్గం అధికంగా ఉండే సిరిసిల్ల ఉద్యమాలకు, పోరాటాలకు కూడా పుట్టినిల్లు. రాజాకార్లకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడిన చరిత సిరిసిల్లకు ఉంది. జనశక్తి సాయుధ ఉద్యమం కూడా ఇక్కడే పురుడు పోసుకుంది. పోరాటాల చరిత్ర ఉన్న సిరిసిల్లలో అనేక మంది కళాకారులు కూడా ఉన్నారు. ఒగ్గు కళాకారుడు మిద్దె రాములు పుట్టింది సిరిసిల్ల జిల్లాలోనే. విప్లవ పాటల గాయని విమలక్క సొంత జిల్లా […]

Written By:
  • NARESH
  • , Updated On : February 26, 2023 / 06:40 PM IST
    Follow us on

    Balagam Movie : సిరిసిల్ల అనగానే తెలంగాణలో అందరికీ గుర్తొచ్చేది చేనేత క్షేత్రం. పద్మశాలీ సామాజికవర్గం అధికంగా ఉండే సిరిసిల్ల ఉద్యమాలకు, పోరాటాలకు కూడా పుట్టినిల్లు. రాజాకార్లకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడిన చరిత సిరిసిల్లకు ఉంది. జనశక్తి సాయుధ ఉద్యమం కూడా ఇక్కడే పురుడు పోసుకుంది. పోరాటాల చరిత్ర ఉన్న సిరిసిల్లలో అనేక మంది కళాకారులు కూడా ఉన్నారు. ఒగ్గు కళాకారుడు మిద్దె రాములు పుట్టింది సిరిసిల్ల జిల్లాలోనే. విప్లవ పాటల గాయని విమలక్క సొంత జిల్లా సిరిసిల్లనే, సిరిసిల్ల నుంచి ఎంతోమంది కళారంగంలో రాణిస్తున్నారు. సినిమాలు, సీరియన్స్, కామెడీ షోలలో సత్తా చాటుతున్నారు. తాజాగా సిరిసిల్ల నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కింది. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ సినిమా రూపొందించారు. నూతన ప్రతిభను ప్రోత్సహిస్తూ ప్రయోగాత్మకంగా ఈ సినిమా తెరకెక్కించారు. ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్‌ జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా సిరిసిల్ల గడ్డపై పుట్టిన నటుడు వేణు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

    తెలంగాణ పల్లెటూరి కథ..
    తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఇక్కడి కళాకారులకు పెద్దగా అవకాశాలు వచ్చేవి కావు. స్వరాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇండస్ట్రీలో తెలంగాణ కళాకారులకు ప్రాధాన్యం దక్కుతోంది. తెలంగాణ నేపథ్యంలో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇందుకు దర్శక నిర్మితలు ముందుకు వస్తున్నారు. అంతక ముందు తెలంగాణ భాష విలనిజానికి, కామెడీకి మాత్రమే ఉపయోగించేవారు. ఇప్పుడు హీరోలుగా, వినన్లుగా, ఆర్టిస్టులు, కమెడియన్లుగా నటించడంతోపాటు తాజాగా దర్శకులుగా కూడా మారుతున్నారు. ఇందుకు సిరిసిల్లకు చెందిన కమెడియన్‌ ఎల్దండి వేణు నిదర్శనం. తెలంగాణ నేపథ్యం కథతోనే వేణు బలగం సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్‌ రాజు ప్రొడక్షన్స్‌ యజమాని, నిర్మాత దిల్‌ రాజు బొమ్మరిల్లు, శతమానం భవతి సినిమాల్లా బలగం సినిమా కూడా బ్యానర్‌కు మంచిపేరు తెస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. వినోదం, భావోద్వేగం కలగలిపిన ఈ సినిమాతో నిర్మితలుగా మారిన హర్షిత్, హన్షితలకు ఈ సినిమా శుభారంభాన్నిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

    వేణు ప్రతిభను ఆవిష్కరిస్తుందా..
    తెలంగాణ నుంచి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన వేణు అనే సినిమాల్లో నటించారు. టీవీ షోల ద్వారా కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బలగం సినిమాతో దర్శకుడిగా మారాడు. దర్శకుడిగా వేణు ప్రతిభను ఆవిష్కరించే చిత్రం అవుతుందని హీరో ప్రియదర్శి ధీమాగా చెబుతున్నారు. ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు ఇటీవలే పూర్తి చేసుకుని ‘యు’ సర్టిఫికెట్‌ పొందిది.

    మార్చి 3న రిలీజ్‌..
    తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో సాగే సినిమాను మార్చి 3న రిలీజ్‌ చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌ రామ్‌సహా ప్రతీ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శక నిర్మాతలు విశ్వాసంతో ఉన్నారు. సినిమాలో హీరో తాత పాత్రలో నటించిన సుధాకర్‌ రెడ్డిగారు, హీరో తండ్రి పాత్రలో నటించిన జయరాం, అలాగే నారాయణ పాత్రలో మురళీధర్, హీరో మేనత్త పాత్రలో విజయలక్ష్మి, హీరో తల్లి పాత్రలో స్వరూప, హీరో బాబాయ్‌ పాత్రలో మొగిలి ఇలా పాత్రలన్నీ మనకు గుర్తుండిపోతాయని పేర్కొంటున్నారు. తెలంగాణకు చెందిన పాటల రచయిత కాసర్ల శ్యామ్‌ రాసిన పాటలు హృదయాలను హత్తుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన ఊరు పల్లెటూరు సాంగ్, పొట్టి పిల్ల సాంగ్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

    తెలంగాణ పల్లె కథతో తీసిన సినిమా మరి ప్రేక్షకులను ఎంతమేరకు ఆకట్టుకుంటోందో.. దర్శకుడిగా వేణు ప్రతిభకు రెస్పాన్స్‌ ఎలా ఉంటుందో తెలియాలంటే మార్చి 3 వరకు ఆగాల్సిందే.