AP Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం ఉభయ తెలుగు రాష్ట్రాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రెండు రాష్ట్రాలకు సంబంధించి సీఎంల కుటుంబసభ్యల పాత్ర ఉందన్న ఆరోపణలు రావడం అంతటా హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇక్కడ గమనించాల్సి విషయం ఒకటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, కేంద్ర పెద్దలకు ఢిల్లీలో అధికారంలో ఉన్న అమ్ ఆద్మీ అంటే గిట్టడం లేదు. అదే సమయంలో తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అంటే పడదు. అయితే లిక్కర్ స్కాంలో తొలుత ఈ రెండు పార్టీలకు సంబంధాలుండడంతో బీజేపీ శరవేగంగా స్పందించింది. అటు ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాతో పాటు టీఆర్ఎస్ ప్రముఖులపై బీజేపీ ఎంపీలు ఆరోపణలు గుప్పించారు. అదే సమయంలో ఎంపీ విజయసాయిరెడ్డి సమీప బంధువు, ఆయన వియ్యంకుడి సోదరుడు భరత్ చంద్రారెడ్డితో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు కూడా బయటకు వచ్చింది.అయితే సీబీఐ ప్రాథమిక దర్యాప్తులో మాత్రమే తేలిందని..ఈ మేరకు ఎఫ్ఐఆర్లో పేర్లు ప్రస్తావనకు వచ్చాయని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఏపీ సీఎం జగన్ భార్య భారతి, కీలక నేత విజయసాయిరెడ్డిల పేర్లు బయటకు వచ్చాయి. ఈ మేరకు టీడీపీలో లిక్కర్ వ్యవహారాల కేసులు చేసే ఆనం వెంకటరమణారెడ్డి వారి పేర్లను బయటకు వెల్లడించారు. వారికి లిక్కర్ స్కామ్ తో సంబంధాలున్నట్టు కొన్నిరకాల పేపర్లు చూపిస్తూ మరి ఆరోపణలు చేశారు.

ముందే చెప్పిన బీజేపీ నేతలు..
వాస్తవానికి ఈ లిక్కర్ స్కాంలో ఏపీ పెద్దల పాత్రపై బీజేపీ నేతలు ఎప్పుడో ఆరోపణలు చేశారు. ఏపీ పర్యటనకు వచ్చిన బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టారు. లిక్కర్ స్కాంలో ఏపీ పెద్దల పాత్ర ఉందని..త్వరలో అది వెల్లడి అవుతుందని కూడా చెప్పారు. కానీ ఆయన మాటలను అంతా లైట్ తీసుకున్నారు. ఎందుకంటే అప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ పాత్ర బయటకు రావడం, నేరుగా సీఎం కేసీఆర్ కుమార్తె కవితను తెరపైకి తేవడంతో అందరి దృష్టి అటుపైనే ఉంది. అటు టీఆర్ఎస్ తో బీజేపీకి రాజకీయ వైరం నడుస్తున్న నేపథ్యంలో కవిత చుట్టూ పట్టుబిగుస్తుందని అందరూ అటువైపు చూడడం ప్రారంభించారు. ఏపీ పెద్దలపై బీజేపీ నేతలు ఆరోపణలు చేసినా పట్టించుకోలేదు. వైసీపీతో బీజేపీ చనువు ఉన్న నేపథ్యంలో అంతా ఉత్తమాటలేనని తేల్చేశారు. ఇప్పుడు ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు జగన్ సతీమణి భారతీ రెడ్డి పేర్లు బయటకు రావడంతో నాడు బీజేపీ నేతల ప్రకటన నిజమేనని తేలింది.
ఫైనాన్సర్ శరత్ చంద్రారెడ్డి..
ప్రస్తుతం లిక్కర్ స్కాంలో చాలా కంపెనీలు చిక్కుకున్నాయి. అయితే వీటిని వెనుక ఉండి ఫైనాన్స్ చేసింది మాత్రం అరబిందో శరత్ చంద్రారెడ్డిగా సీబీఐ గుర్తించింది. ఈయన విజయసాయిరెడ్డికి వియ్యంకుడికి స్వయాన సోదరుడు కావడంతో ప్రాధాన్యతను సంతరించుకుంది.వీరి ట్రైడెంట్ ఆఫ్ సెన్సెస్ సంస్థ సాక్షిలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సంస్థపై సీబీఐ కేసులు సైతం కొనసాగుతున్నాయి. ఇప్పుడిదే కంపెనీ లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న సంస్థలన్నింటికీ పెట్టుబడి పెట్టింది. అలాగే విజయసాయిరెడ్డికి చెందిన అదాని డిస్టలరీస్ కంపెనీకి కూడా లిక్కర్ స్కాంతో సంబంధాలున్నాయని కొన్నిరకాల ఆధారాలతో టీడీపీ ఆరోపణలు చేస్తోంది.
జగన్ ఢిల్లీ టూర్ వెనుక..
అయితే జగన్ ఢిల్లీ ఆకస్మిక టూర్ వెనుక లిక్కర్ స్కాంలో తనవారి పేర్లు బయటకు రాకుండా చూసుకోవడానికేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే అరబిందో శరత్ చంద్రారెడ్డిని సీబీఐ ప్రశ్నిస్తోంది. ఆయన కానీ నోరు విప్పితే భారతితో పాటు విజయసాయిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకునే అవకాశముంది. అయితే ఇప్పుడు పనిలోపనిగా ఏపీలో లిక్కర్ పాలసీ పై కూడా సమగ్ర విచారణకు టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఏపీలో సమీకరించిన వేల కోట్ల రూపాయలనే అదాని డిస్టలరీస్ కంపెనీ లిక్కర్ స్కాంలో చిక్కుకున్న కంపెనీలకు పెట్టుబడులు పెట్టినట్టు టీడీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే స్కాం మాత్రం ఉభయ తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తోంది.