
‘‘ఉట్టికి ఎగురలేనమ్మా.. స్వర్గానికి నిచ్చెన వేస్తుందట..’’ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల పరిస్థితి అలానే ఉందట.. వాళ్లు అధికారంలోకి తీసుకురారు.. తెస్తామన్నవారిని కాంగ్రెస్ లో తొక్కేస్తారు.. అధిష్టానం వద్ద మాత్రం ఊహాల పల్లకీని చూపిస్తారు.. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఏడేళ్లు.. తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు.. తెలంగాణను ఇచ్చిన పార్టీగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురాలేకపోయారు. ఐక్యత లోపం.. ఎవరికి వారు యమునా తీరం.. సీఎం కేసీఆర్ ఆటలో అరటిపండ్లు.. ఇలా చాలా విమర్శలను తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు ఎదుర్కొన్నారు. ఏడేళ్లుగా కాంగ్రెస్ ను తెలంగాణలో అథ: పాతాళానికి తొక్కేసారు. బీజేపీని ఎదిగేలా చేసి ఇప్పుడు మూడోస్థానానికి దిగజార్చారు.
దీంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ సీనియర్లకు అవకాశాలు ఇచ్చి.. వారి కుట్రలు, కుతంత్రాలను పసిగట్టి పూర్తిగా ప్రక్షాళన చేసింది. రేవంత్ రెడ్డిని పీసీసీని చేసి అంతా యువకులు, ఉత్సాహవంతులు, రేవంత్ రెడ్డి వర్గానికి నిక్కచ్చిగా పనిచేసే వారికి పెద్దపీట వేసింది.
ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఇలా అందరూ పీసీసీ చీఫ్ కోసం ఆశపడ్డారు. వారందరిని పక్కనపెట్టిసి.. సీనియర్లను పూర్తిగా ఏ పదవి ఇవ్వకుండా చేసి కాంగ్రెస్ అధిష్టానం సంచలన నిర్ణయం తీసుకుందనే చెప్పాలి.
ఇక రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ చేస్తే పార్టీ మారుతానని కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, వీహెచ్ లాంటి వారు బెదిరించినట్టు ఆరోపణలున్నాయి. అయినా కూడా వెనక్కి తగ్గకుండా బెదిరించిన వారికి పీసీసీలో చోటు కల్పించకుండా కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చింది.
మరి ఈ షాక్ తో సీనియర్లు కాంగ్రెస్ కు రాజీనామా చెబుతారా? టీఆర్ఎస్ లో చేరుతారా? లేక గమ్మున పార్టీకి దూరంగా ఉంటారా? ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీని చీల్చుతారా? అన్నది గుంభనంగా ఉంది. రెండు రోజులు గడిస్తే కానీ ఈ అనిశ్చితిపై స్పష్టత రాదు.
సీనియర్లు అందరూ టీడీపీ నుంచి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ఓన్ చేసుకునే అవకాశాలు అయితే కనిపించడం లేదు. సో కాంగ్రెస్ లో అసమ్మతి ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ల దారెటు? అనేది ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ చీలిక దిశగా సాగుతుందా? అన్న అనుమానాలు ఉన్నాయి.
కానీ పార్టీని బతికించడం కోసం.. పార్టీని తెలంగాణలో నిలబెట్టడం కోసం కాంగ్రెస్ అధిష్టానం కఠిన నిర్ణయం తీసుకుంది. సీనియర్లతో తెలంగాణలో అధికారంలోకి రావడం కష్టమని నిర్ధారించుకుంది. ఈ డేరింగ్ స్టెప్ వేసింది. మరి వారి ఆశలను రేవంత్ రెడ్డి తీరుస్తాడా? లేదా? అన్నదానికి కాలమే సమాధానం చెబుతుంది..
-నరేశ్ ఎన్నం