ఎన్నో తర్జనభర్జనలు.. రెండు మూడేళ్లుగా శూలశోధనలు.. సీనియర్ల అభ్యంతరాలు.. రేవంత్ రెడ్డి పడిగాపులు.. పోటీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. జగ్గారెడ్డి.. ఇలా ఎంతో మంది పోటీపడ్డ టీపీసీసీ పగ్గాలు చివరకు అన్నీ దాటుకొని రేవంత్ రెడ్డి చేతుల్లో పడ్డాయి. తెలుగు దేశం పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ వాదులను పక్కనపెట్టి మరీ రేవంత్ రెడ్డి టీపీసీసీ పగ్గాలు అందుకున్నారు. కాంగ్రెస్ సీనియర్లతో కానిది రేవంత్ రెడ్డితో అవుతుందా? అసలు రేవంత్ రెడ్డి చేతిలో ఏముందని అంతపెద్ద పదవిని కాంగ్రెస్ కట్టబెట్టింది. ఓటుకు నోటు కేసులో నిందితుడుగా ఉన్నా కూడా కాంగ్రెస్ సీనియర్లను నమ్మకుండా.. రేవంత్ పై కాంగ్రెస్ ఎందుకు నమ్మకం ఉంచింది? అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను తెలంగాణలో ఎలా అధికారంలోకి తేగలడు? అతడి ప్లాన్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది.
కాంగ్రెస్ సీనియర్ నాయకులను గడిచిన ఏడేళ్లుగా అధిష్టానం గమనిస్తూనే ఉంది. ఇప్పటికే రెండు సార్ల అధికారాన్ని కేసీఆర్ కు పువ్వుల్లో పెట్టి అప్పగించేశారు. కేసీఆర్ కు కొందరు కోవర్టులుగా మారారన్న ఆరోపణలు ఉన్నాయి. నిన్న కాంగ్రెస్ సీనియర్లు ప్రగతిభవన్ వెళ్లి కేసీఆర్ ను కలవడం అధిష్టానానికి కోపం తెప్పించిందంటున్నారు. అందుకే కాంగ్రెస్ సీనియర్లు అందరినీ పక్కనపెట్టి అంతా యువ బ్యాచ్ తో రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటించారని అంటున్నారు. కేసీఆర్ అంటేనే ఢీ అంటే ఢీ అనే రేవంత్ కు ఈ తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు అప్పజెప్పారని.. టీడీపీ నుంచి వచ్చినా కేసీఆర్ ను ఢీకొట్టే ఏకైక నేతగా కాంగ్రెస్ అధిష్టానం గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి ప్రధానంగా వైఎస్ బాటలో నడిచేందుకు డిసైడ్ అయ్యారు. నాడు వైఎస్ కూడా చంద్రబాబుతో ఢీ అంటే ఢీ అన్నాడు.కాంగ్రెస్ లోని అసమ్మతులను ఎదురించి పాదయాత్ర చేసి కాంగ్రెస్ ను రెండు సార్లు అధికారంలోకి తీసుకొచ్చాడు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి అస్త్రం కూడా పాదయాత్రనేనట.. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉంది. ఈ రెండేళ్లు పాదయాత్రతో ప్రతి జిల్లా తిరిగి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి కార్యాచరణ తయారు చేశారని.. అతడి దూకుడు, ఆలోచన స్వభావం.. ప్రణాళికలు నచ్చియే కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ పగ్గాలు అప్పజెప్పిందని ప్రచారం సాగుతోంది.
రేవంత్ రెడ్డికి కేసీఆర్ లాగా మంచి వాగ్ధాటి ఉంది. రాజకీయ చతురత ఉంది. కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అనగల ధైర్యం మొండితనం ఉంది. కేసీఆర్ కు భయపడే రకం అస్సలు కాదు. కాంగ్రెస్ సీనియర్లులాగా వెనుకడుగు వేసి కాడివదిలేసే రకం కాదు.. మొండిగా ముందుకెళుతాడు. అందుకే ఈ మొండి ఘటానికి తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి అధిష్టానం చాన్సు ఇచ్చింది.
రేవంత్ రెడ్డి తెలంగాణ అంతటా పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని తద్వారా తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ ను తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. పాదయాత్రనే బ్రహ్మాస్త్రంగా సంధించబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్ర చేసిన వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్ లు సీఎంలు అయ్యారు. ఇప్పుడు అదే కోవలో రేవంత్ రెడ్డి కూడా ఇదే పాశుపతాస్త్రాన్ని సంధించబోతున్నారు. కేసీఆర్ ను ఓడించడమే ధ్యేయంగా ఈ ప్లాన్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.