
‘బండి’ పాదయాత్రకు రెడీ అవుతోంది.. ‘కిషన్ రెడ్డి’ జన ఆశీర్వాద యాత్ర ముగించి జాతీయ రాజకీయాల వైపు వెళ్లారు. బీజేపీ శ్రేణులు హుజూరాబాద్ వదిలి పాదయాత్రకు సమాయత్తం అవుతున్నాయి. హుజూరాబాద్ లో బీజేపీ తరుఫున పోటీచేస్తున్న ఈటల రాజేందర్ ఇప్పుడు ఒంటరి పోరాటం మొదలుపెట్టారు. దీంతో అగ్రనేతలు వదిలేసిన హుజూరాబాద్ లో ఈటలను దెబ్బకొట్టే ప్లాన్లను విజయవంతంగా అమలు చేస్తోంది గులాబీ దండు. ఈ పరిణామం బీజేపీని హుజూరాబాద్ లో చావుదెబ్బ తీస్తోంది.
ఎన్నో ఆశలు ఆకాంక్షలతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ బీజేపీలో చేరిపోయారు. అయితే ఆయన అన్నుకున్నది ఒక్కటి.. ఇప్పుడు హుజూరాబాద్ లో జరుగుతున్నది ఒక్కటి అని మథన పడుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. అమిత్ షా సమక్షంలో చేరుతారనుకున్న ఈటల ఇద్దరు కేంద్రమంత్రుల సమక్షంలో బీజేపీలో చేరిపోయారు. సీఎం కేసీఆర్ ను ఎదురించి బయటకొచ్చినప్పుడు ఈటల వెంట బీజేపీ నేతలంతా ఉన్నారు. కానీ ఇప్పుడూ ఎవరూ ఉండడం లేదని నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారట..
ఈటల రాజేందర్ ఆయువు పట్టుపై కొడుతున్నాడు సీఎం కేసీఆర్. ఆయనను ఒంటరిని చేసే ప్లాన్ ను అమలు చేస్తున్నాడు. ఆదివారమే ఈటలతోపాటు బీజేపీ చేరిన ఆయన సన్నిహిత నేతలు ఇద్దరూ ఆపార్టీకి రాజీనామా చేసి తిరిగి టీఆర్ఎస్ లో చేరిపోవడం ఈటలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టైంది. ఇందులో ఒకరు కరీంనగర్ జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ వైఎస్ చైర్మన్ పింగిలి రమేశ్ కాగా.. మరో నాయకుడు చుక్క రంజిత్ ఇదివరకు ఈటల రైట్ హ్యాండ్ గా ఉన్నాడు. బీజేపీకి వీరిద్దరూ రాజీనామా చేయడం ఈటలకు కృంగదీసిందని చెబుతున్నారు. బీజేపీలో తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని.. అందుకే టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు.
నిజానికి ఈ పరిణామం జరగడానికి బీజేపీ అధిష్టానం పెద్దలు హుజూరాబాద్ ను పట్టించుకోకపోవడమే కారణం అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, స్వయంగా కరీంనగర్ జిల్లా వాసి అయిన బండి సంజయ్ ఆ జిల్లాలోని హుజూరాబాద్ పై ఫోకస్ పెట్టడం లేదు. ఆయన తన పాదయాత్రకు రంగం సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ లో దీని విజయం కోసం కార్యకర్తలు, నేతలతో బిజీగా ఉన్నారు. ముఖ్యమైన నేతలు ఈయన వెంటే ఉండి హుజూరాబాద్ కాడి వదిలేశారు.
ఇక మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర పేరిట తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతున్నాడు. ఆయన తెలంగాణలోని పలు నగరాలు, నియోజకవర్గాల్లో తిరిగినా ఉప ఎన్నిక జరిగే హుజూరాబాద్ వైపు కన్నెత్తి చూడలేదు. కనీసం యాత్రను ఆ నియోజకవర్గంలో ఉండేలా చూసుకోలేదు.
దీంతో ఈటల రాజేందర్ ఈ పరిణామంపై గుర్రుగా ఉన్నాడని..మొదట మద్దతుగా ఉన్న బీజేపీ అగ్రనేతలు అసలు ఇప్పుడు హుజూరాబాద్ వైపే చూడడం లేదని లోలోపల రగిలిపోతున్నట్టు తెలిసింది. ఇక టీఆర్ఎస్ తో పోల్చితే అధికారం, డబ్బు పరపతి కూడా బీజేపీ నేతలు, ఈటలకు తక్కువే. సరిపడా నిధులు , కార్యకర్తలకు డబ్బులు పంచడంలోనూ బీజేపీ అధిష్టానం చూసి చూడనట్టుగా ఉంటుందని చెబుతున్నారు.
ఇక మొన్నటివరకు హుజూరాబాద్ లో వాలిపోయిన బండి సంజయ్ బ్యాచ్ నేతలు, కార్యకర్తలు ఇప్పుడు అంతా హైదరాబాద్ కు షిప్ట్ అయ్యారు. ఆయన పాదయాత్ర కోసం సిద్ధమవుతున్నారు. హుజూరాబాద్ ను బీజేపీ శ్రేణులు అంతా వదిలిపోవడంతో అక్కడ ఉన్న నేతల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. ఈ క్రమంలోనే ఈటలకు రైట్ హ్యాండ్ లాంటి వారు ఆయనను వదిలేస్తున్న పరిస్థితి నెలకొంది. అధికార టీఆర్ఎస్ భారీ ఆఫర్లు, పదవులతో వారు ఈటలకు బీజేపీకి గుడ్ బై చెబుతున్నారు. ఎన్నికల యుద్ధం క్షేత్రం హుజూరాబాద్ ను వదిలేసిన బీజేపీ అగ్రనేతల తీరు ఇప్పుడక్కడ పార్టీని, ఈటలను బలహీన పరుస్తోందన్న చర్చ ఆ పార్టీ వర్గాల్లో సాగుతోంది.