Homeజాతీయ వార్తలుTomato Flu Outbreak in India: భారత్ లో మరో వైరస్ కలకలం

Tomato Flu Outbreak in India: భారత్ లో మరో వైరస్ కలకలం

Tomato Flu Outbreak in India: ఇప్పటికీ కోవిడ్ 19 తో పోరాటం చేస్తూనే ఉన్నాం. మొదటి, రెండు దశల్లో అపారమైన నష్టాన్ని చవి చూశాం. ఆ సమయంలోనే కేరళలో ప్రబలిన నింపా వైరస్ వెన్నులో వణుకు పుట్టించింది. దాన్ని మర్చిపోకముందే మంకీ ఫాక్స్ కలకలం సృష్టించింది. ఇప్పుడు ఇదీ చాలదన్నట్టు కొత్తగా టమాటో ఫ్లూ ప్రబలుతోంది. శనివారం విడుదలైన లాన్సెట్ అధ్యయనం ప్రకారం మే 6వ తేదీన దేశంలో కేరళలో మొదటి టమాటో ఫ్లూ కేసు నమోదయింది. ఇప్పటిదాకా దేశంలో 82 కేసులు నమోదయ్యాయి. ఇది అంటువ్యాధి కావడంతో వైరస్ వ్యాప్తి చెందితే పరిస్థితి చేయి దాటుతుంది కాబట్టి దీని నివారణకు భారత వైద్య నిపుణులు పోరాడుతున్నారు.

Tomato Flu Outbreak in India
Tomato Flu

ఏమిటి ఈ వైరస్

లాన్ సెట్ వైద్యుల అధ్యయనం ప్రకారం ఈ ఫ్లూ 1 నుంచి 5 సంవత్సరాల వయసు గల పిల్లలు, నిరోధక శక్తి తక్కువగా ఉన్న పెద్దలకు త్వరగా వ్యాపిస్తుంది. ఇది పూర్తి అంటువ్యాధి కావడంతో శరీరంపై నేరుగా ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా చేయి, నోరు, పాదాలు ప్రభావితమవుతాయి. వైరస్ తీవ్రతను బట్టి నోటిలో అంతర్గత పుండ్లు ఏర్పడతాయి. రక్త స్రావం కూడా అవుతుంది. టమాటో ఫ్లూ కేసును 2022 మే ఆరో తేదీన కేరళలోని కొల్లం జిల్లాలో మొదటిసారిగా గుర్తించారు. టమాటో ఫ్లూ వైరస్ కోవిడ్ 19 లక్షణాలను కలిగి ఉంటుందని లాన్ సెట్ వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ వైరస్ సార్స్ _ కొవిడ్ _2 కి సంబంధించినది కాదని వైద్యులు అంటున్నారు. ఒక్కసారి ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే జ్వరమే కాకుండా చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి వాటికి కూడా దారి తీయొచ్చని వైద్యులు చెబుతున్నారు.

Also Read: Junior NTR- Amit Shah: అమిత్ షాతో జూ.ఎన్టీఆర్ భేటి: ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా జూ.ఎన్టీఆర్..? ఓకే అంటే పగ్గాలే?

లక్షణాలు ఎలా ఉంటాయంటే

శరీరం మొత్తం ఎర్రటి అంటే టమాటా రంగులో బొబ్బలు ఏర్పడతాయి. అవి పగిలిపోయి స్రావాలు విడుదలవుతుంటాయి. కొన్నిసార్లు బొబ్బలు టమాటా పరిమాణంలో పెరుగుతాయి. టమాటా ఫ్లూ సోకిన పిల్లలను లాన్ సెట్ వైద్యులు పరిశీలించగా.. ప్రాథమిక లక్షణాలు చికున్ గున్యా మాదిరిగానే ఉన్నాయి. అధిక జ్వరం, దద్దుర్లు, కీళ్లనొప్పి, ఒంటినొప్పి వంటి లక్షణాలు తీవ్రంగా ఉన్నాయి. కీళ్ల వాపు అయితే అడుగు తీసి అడుగు పెట్టనీయలేదు. దీనికి తోడు వికారం, విరేచనాలు, డీ హైడ్రేషన్, అధిక జ్వరం రోగులను ఇబ్బంది పెట్టింది. ఇక నోటిలో పుండ్లు ఏర్పడి అధిక రక్తస్రావం కావడం వల్ల రోగి ఏమీ తినలేడు. ఇదే పరిస్థితి కొనసాగితే రోగికి ప్రాణాపాయం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలో ఎటువంటి మరణాలు సంభవించకపోయినప్పటికీ 82 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

Tomato Flu Outbreak in India
Tomato Flu

ఎందుకు ఈ వైరస్ లు విజృంభిస్తున్నాయి

గత దశాబ్ద కాలంలో మానవ జీవితాన్ని పలు వైరస్ లు కకావికలం చేశాయి. ఆంత్రాక్స్, సార్స్, స్వైన్ ఫ్లూ, చికున్ గున్యా, కోవిడ్ 19, నింఫా, మంకీ ఫాక్స్, ఇప్పుడు టమాటో ఫ్లూ.. పేర్లు ఏవైనా వ్యాధి తీవ్రత ఒక్కటే. వీటిల్లో కరోనా చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఆ వ్యాధి తీవ్రత నుంచి ప్రపంచం ఇంకా కోలు కోలేదు. ఎక్కడో ఒకచోట కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరణాలు కూడా సంభవిస్తూనే ఉన్నాయి. మనిషి జీవిత గమనం పై ముప్పేట దాడి చేస్తున్న ఈ వైరస్ లు రూపం మార్చుకుంటున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి జన్యు క్రమాన్ని అనుసరించి మందులు తయారు చేస్తే.. అవి వెంటనే వాటి అనువంశిక రూపాన్ని మార్చేసుకుంటున్నాయని చెబుతున్నారు. అందువల్లే వీటిని నిరోధానికి వెంటనే మందులు కనిపెట్టలేకపోతున్నామని చెబుతున్నారు. ఈ కారణం వల్లే కోవిడ్ కు ఇప్పటికీ ఒక నిర్దిష్టమైన చికిత్స విధానం అంటూ లేదు. వ్యాక్సిన్లు, బూస్టర్ డోస్ లు తయారు చేసినా ఇప్పటికి చాలా మందిలో కోవిడ్ పాజిటివ్ లక్షణాలు బయట పడుతూనే ఉన్నాయి. గత కొద్ది కాలంగా వాతావరణంలో ఏర్పడిన మార్పులు కూడా వైరస్ ఉధృతికి కారణమవుతున్నాయి. కొన్నేళ్లుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో స్థాయికి మించి వర్షాలు కురుస్తున్నాయి. ఎండలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇలాంటి వాతావరణ పరిస్థితులే వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నాయని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, మొక్కలను విరివిగా నాటడం, శుభ్రమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం, ధూమపానం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉంటేనే వైరస్ ను శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవచ్చని సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశంలో టమాటో ఫ్లూ కేసులు 82 నమోదు కావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు, లాన్ సెట్ వైద్య బృందంతో కలిసి ప్రయోగాలు చేస్తున్నారు. ఫ్లూ సోకిన రోగి శరీరం నుంచి వైరస్ సేకరించి దాని ఉధృతికి అడ్డుకట్ట వేసే మందులను కనిపెట్టే పనిలో తలమునకలై ఉన్నారు.

Also Read:Indian Film Industry: ఇండియన్‌ సినిమా డామినేషన్‌.. హాలీవుడ్‌తో పోటీ..!

 

 

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular