Chandrababu Arrest: ఇప్పుడు అందరి చూపు సుప్రీంకోర్టు వైపే ఉంది. చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ఫై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ ఉంది. ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. నేటికీ విచారణను వాయిదా వేసింది. అయితే తీర్పు ప్రకటిస్తుందా? లేదా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా 17 ఏ సెక్షన్ చుట్టూ విచారణ సాగడంతో దేశం యావత్తు ఆశగా ఎదురుచూస్తోంది.
తెలుగుదేశం పార్టీలో తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. క్వాష్ పిటిషన్ పై అనుకూల తీర్పు వస్తే టిడిపి రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తుంది. ఆ పార్టీ ఆనందానికి అవధులు ఉండవు. గత 40 రోజులుగా టిడిపి శ్రేణులు బాధతో ఉన్నాయి. అనుకూల తీర్పు వస్తే మాత్రం రెట్టింపు ఉత్సాహం నెలకునే అవకాశం ఉంది.అదే సమయంలో పిటీషన్ కొట్టేస్తే ఎలా ముందుకెళ్లాలో అన్నదానిపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆలోచిస్తున్నాయి. అటు నాయకత్వం సైతం బెయిల్ పై చంద్రబాబును బయటకు తెచ్చేందుకు వ్యూహాలు రూపొందిస్తోంది. బాబు వయసు, ఆరోగ్య పరిస్థితులపై ఇప్పటికే సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ దాఖలు చేసింది. క్వాష్ పిటిషన్ పై అనుకూల తీర్పు వచ్చినా, మధ్యంతర బెయిల్ లభించినా టిడిపికి బిగ్ రిలీఫ్. లేకుంటే మాత్రం ఇబ్బందికరమే.
చంద్రబాబు కేసు విచారణని వైసిపి సునిశితంగా పరిశీలిస్తుంది. ఒకవేళ చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెచ్చిపోయే అవకాశం ఉంది. శాంతిభద్రతలకు విఘాతం తలెత్తే అవకాశం ఉంది. అందుకే వైసీపీ సర్కార్ ముందస్తు చర్యలను చేపడుతోంది. తీర్పును అనుసరించి ప్రత్యేక భద్రతా చర్యలను చేపట్టనుంది. చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం జగన్ సర్కార్ కు మైనస్ గా మారనుంది. నేరుగా చంద్రబాబు ప్రజల్లోకి వచ్చి జగన్ సర్కార్ చర్యలను వివరించే అవకాశాలు ఉన్నాయి. రాజకీయంగా సైతం మైనస్ గా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అయితే ఈ కేసు విచారణను, తుది తీర్పును వెలువరించే అవకాశం ఉందా? లేదా? అనేదానిపై జోరుగా చర్చ సాగుతోంది. నేటి విచారణ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. ఈ నెలాఖరు వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి. నవంబర్ లోనే ఈ తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నట్లు సుప్రీంకోర్టు వర్గాలు చెబుతున్నాయి. అయితే అదే సమయంలో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చి.. విచారణను కొనసాగించాలని ఆయన తరపు న్యాయవాదులు ఇదివరకే న్యాయస్థానాన్ని కోరారు. ఈ తరుణంలో దీనిని కోర్టు పరిగణలో తీసుకుంటుందా? లేకుంటే దసరా సెలవుల అనంతరం విచారణ చేపడుతుందా? అన్నది తెలియాల్సి ఉంది.