Homeఆంధ్రప్రదేశ్‌Rushikonda: రుషికొండలో చకచకా నిర్మాణాలు.. మరోవైపు కోర్టులో కేసులు.. ఏం జరుగుతుందో?

Rushikonda: రుషికొండలో చకచకా నిర్మాణాలు.. మరోవైపు కోర్టులో కేసులు.. ఏం జరుగుతుందో?

Rushikonda: ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో విశాఖ నుంచి పాలనకు జగన్ సిద్ధపడుతున్నారు. తనతో పాటు యంత్రాంగాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకుగాను ముగ్గురు అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు సీఎం క్యాంప్ ఆఫీస్ కోసమేనని భావిస్తున్న రిషికొండలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు 270 కోట్ల రూపాయలతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి. అదే సమయంలో ఇది పర్యావరణానికి విఘాతానికి కలిగించే నిర్మాణాలని దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయ్యింది. అయినా సరే యంత్రాంగం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. శరవేగంగా పనులు జరిపిస్తోంది.

రుషికొండను నాలుగు బ్లాకులుగా విభజించారు. మొత్తం 13,542 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇక్కడే సీఎం నివాసంతో పాటు కార్యాలయం ఉంటుందని పిలుస్తోంది. ప్రధానంగా విజయనగర బ్లాక్ లో సీఎం నివాసం ఉండేందుకు భవనాన్ని సిద్ధం చేస్తున్నారు. తొలుతా ఈ బ్లాక్ ను 5828 చదరపు మీటర్ల మేర నిర్మించాలని ప్రతిపాదించారు. కానీ దానిని ఇప్పుడు 3764 చదరపు మీటర్లకు కుదించారు. సముద్రానికి అభిముఖంగా ఉన్న ఈ భవనం నుంచి బీచ్ అందాలు ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. ఇందులోనే రెసిడెన్షియల్ సూట్ గదులను సైతం సిద్ధం చేస్తుండడం విశేషం.

కళింగ బ్లాక్ లో సీఎం కార్యాలయం కోసం వినియోగిస్తారని సమాచారం. తొలుత 5753 చదరపు మీటర్లలో దీని నిర్మించాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు 7266 చదరపు మీటర్లకు పెంచారు. ఇప్పుడున్న నాలుగు బ్లాకుల్లో ఇదే పెద్దది. మరోవైపు వేంగి బ్లాకులో 1821 చదరపు మీటర్లలో, గజపతి బ్లాక్ లో 690 చదరపు మీటర్లలో నిర్మాణాలు చేపడుతున్నారు. సీఎం నేరుగా విమానాశ్రయం నుంచి రుషికొండకు హెలికాప్టర్ ద్వారా చేరుకునేలా బీచ్ లో హెలిపాడ్ ఉపయోగిస్తారు అన్న ప్రచారం సాగుతోంది. గత ప్రభుత్వ హయాం లో హెలీ టూరిజం ద్వారా హెలిపాడ్ను నిర్మించారు. ఇప్పుడు దానినే వినియోగించనున్నారు.

ఇంత చేస్తున్న ప్రభుత్వం అటువైపుగా వెళ్తున్న సామాన్యులను చుక్కలు చూపిస్తోంది. ఆ నిర్మాణాలకు సంబంధించి ఫోటోలు తీసినా అక్కడ ఉండే భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్లు తీసుకుని ఫోటోలను డిలీట్ చేస్తున్నారు. రుషికొండ చుట్టూ మూడు చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు పోలీసు భద్రత కొనసాగుతోంది. అసలు రిషికొండపై చేపడుతున్న నిర్మాణాల విషయంలో ప్రభుత్వం అధికారికంగా ఇంతవరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. మరోవైపు చూస్తే ఈ నిర్మాణాలు పర్యావరణానికి విఘాతం అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఒకవేళ వ్యతిరేకంగా తీర్పు వస్తే ఈ నిర్మాణాల మాటేమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular