spot_img
Homeజాతీయ వార్తలుIndia Ethanol Cooking Stove: భారత్ ముందడుగు.. వంట చేసుకోవడానికి ఇక ఎల్పీజీ అవసరంలేదు..

India Ethanol Cooking Stove: భారత్ ముందడుగు.. వంట చేసుకోవడానికి ఇక ఎల్పీజీ అవసరంలేదు..

India Ethanol Cooking Stove: అవసరాల నుంచి ఆవిష్కరణలు పుడతాయి. తద్వారా కొత్త కొత్త ఉత్పత్తులు.. వినూత్నమైన విధానాలు తెరపైకి వస్తాయి. ఇప్పుడు భారత్ కూడా కొత్త ఆవిష్కరణలను సృష్టించింది. వినూత్నమైన విధానాలను అందిపుచ్చుకుంది. ప్రపంచం మొత్తం విపత్తులో ఇబ్బంది పడుతుంటే.. భారత్ మాత్రం అద్భుతమైన పరిష్కార మార్గం కనుగొన్నది. ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారులు ఉన్న తన దేశానికి బలమైన తోవ చూపించింది.

ఒకప్పుడు వంట చేసుకోవడానికి కట్టెల పొయ్యిలు మాత్రమే దిక్కు. వాటి వల్ల మహిళలు అనారోగ్యానికి గురవుతున్నారని ప్రభుత్వాలు ఎల్పిజి విధానాన్ని తెరపైకి తీసుకువచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్పిజి కనెక్షన్ల విషయంలో అంతగా వేగం ఉండేది కాదు. ఎప్పుడైతే బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో.. ఎల్పిజి కనెక్షన్ల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఒక నివేదిక ప్రకారం మన దేశంలో మారుమూల గ్రామాల నుంచి మొదలుపెడితే కాస్మోపాలిటన్ నగరాల వరకు ఎల్పిజి వాడకం కొనసాగుతోంది.

మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో గ్యాస్ సరఫరా విషయంలో అంతరాయం ఏర్పడింది. హర్ముజ్ జల సంధిలో గ్యాస్, చమురు రవాణాను ఇరాన్ ప్రభుత్వం అడ్డుకున్న నేపథ్యంలో.. మన దేశానికి సరిపడా గ్యాస్ లభించడం లేదు. దీంతో కొరత ఏర్పడి.. ధరలు పెరిగాయి. గ్యాస్ లభించకపోవడంతో హోటల్లు చాలా వరకు మూతపడ్డాయి. హాస్టళ్లకు కూడా తాళాలు పడ్డాయి. అయితే ఈ పరిస్థితి మిగతా దేశాలకు ఎలా ఉన్నా సరే.. 142 కోట్ల జనాభా ఉన్న భారతదేశాన్ని మాత్రం ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే సరఫరా వ్యవస్థ ఒకసారి స్తంభించిపోతే ఆ ప్రభావం దేశం మొత్తం మీద పడుతుంది.

మనదేశంలో గ్యాస్ నిల్వలు అంతగా లేవు. మన వంట అవసరాలకు ఇతర దేశాల మీద ఆధారపడాల్సిందే. దిగుమతి చేసుకొని ప్రజలకు సరఫరా చేయాల్సి ఉంటుంది. గ్యాస్ కోసం భారీగానే ప్రభుత్వం విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు పెడుతూ ఉంటుంది. అయితే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఏర్పడిన యుద్ధం వల్ల గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడం ప్రభుత్వాన్ని ఆలోచనలో పడేసింది. అందువల్లే ప్రత్యామ్నాయ మార్గంగా ప్రభుత్వం ఇథనాల్ వైపు దృష్టిసారించింది.

ఇదే విషయాన్ని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ కార్యదర్శి సంజీవ్ చోప్రా వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఏఐడీఏ వార్షిక డిష్టిలర్స్ సదస్సులో ఆయన మాట్లాడారు. “ఒక ప్రాథమిక నమూనా మాదిరిగా ఇథనాల్ ఆధారిత వంట స్టవ్ మేము చూసాం. ఒకవేళ వీటి ఉత్పత్తిని పెంచినట్లయితే భద్రత, లభ్యత రెండు ఉండేలాగా మనం నిర్ధారించుకోవాలి. ఇలాంటి మార్పు కోసం సరఫరా విషయంలో లాజిస్టిక్స్ ను పరిశీలించేందుకు మార్పులు కూడా జరుగుతున్నాయని” ఆయన పేర్కొన్నారు.

వంట ఇంధనానికి ప్రత్యామ్నాయంగా ఇథనాల్ మీద కొద్ది రోజులుగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. కొన్ని అధ్యయనాలు కూడా ప్రభుత్వ లక్ష్యానికి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది.. చమురు రంగం అవసరాలకు అనుగుణంగా సరఫరా సామర్థ్యం పెరిగిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.. వాస్తవ చమురులో 30% ఇథనాల్ కలిపి వాడే విధంగా ప్రణాళికలు రూపొందిచారు. కొన్నిచోట్ల ఇది విజయవంతంగా నడుస్తోంది. అయితే ఇప్పుడు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో బయో ఇంధనాన్ని డీజిల్ లో కలిపి వాడే విధంగా ప్రభుత్వం ప్రయోగాలు చేస్తోంది. బయో ఇంధనాన్ని ఉపయోగించి వస్త్ర పరిశ్రమలో ఉప ఉత్పత్తుల తయారీకి వాడాలని భావిస్తోంది..

నూకల ద్వారా ఇథనాల్ తయారుచేస్తారు. అయితే ఇప్పుడు నూకల లభ్యత చాలావరకు తగ్గిపోయింది. గతంలో రైస్ మిల్లుల నుంచి 25% నూకలు వచ్చేవి. ఇప్పుడు ఆశాతం 10కి పడిపోయింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అధిక కేటాయింపులు ఇచ్చినప్పుడు డిమాండ్ అనేది ఒక అవరోధంగా ఉండదు. అయితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బియ్యం సరఫరా నుంచి నూకలవైపు మారితే మాత్రం బయో ఇంధనం విస్తారంగా తయారు చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.. అంతేకాదు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద బియ్యం నాణ్యతను మెరుగుపరచడానికి ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు చేపడుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు కొనసాగుతోంది.

ఈ ప్రాజెక్టు గనుక విజయవంతం అయితే.. బియ్యం తయారీ తరువాత వచ్చే వ్యర్ధాలతో బయో ఇంధనాన్ని తయారుచేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది కేంద్రం. ఇదే గనుక జరిగితే మనదేశంలో ఇంధన అవసరాలు పూర్తిగా మన చేతిలోనే ఉంటాయి. ఇతర దేశాల మీద ఆధారపడడం చాలా వరకు తగ్గిపోతుంది. ఫలితంగా విదేశీ మారకద్రవ్యం మిగులుబాటు జరుగుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version