Times Now Survey: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో ప్రధాన పార్టీలతోపాటు వివిధ సంస్థలు సర్వేలు చేస్తున్నాయి. ఓటరు నాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ సర్వే సంస్థ టౌమ్స్‌నౌ సోమవారం రాత్రి తన సర్వే ఫలితాలను విడుదల చేసింది. అయితే ఆ సంస్థ అసెంబ్లీ ఎన్నికల గురించి కాకుండా.. లోక్‌సభ ఎన్నికలపై ప్రజల నాడి తెలుసుకుంది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు జోష్ ఇచ్చే ముచ్చట చెప్పింది. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 9 నుంచి 11 స్థానాలు గెలుస్తుందని తమ సర్వేలో తేలినట్లు ప్రకటించింది. ఇక జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్‌కు 2 నుంచి 4 స్థానాలకే పరిమితం చేసింది. ఎంఐఎంకు ఒకటి అని నేరుగా చెప్పకుండా ఇతరులకు ఒకటి అని కన్ఫాం చేసింది.
సర్వేలో నిజమెంత..
టౌమ్స్ నౌ సర్వేలో నిజమెంత అన్న చర్చ ఇప్పుడ తెలంగాణ వ్యాప్తంగా జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ అసెంబ్లీ ఎన్నికల గురించి సర్వే ఫలితాలు ఇవ్వాల్సి ఉండగా, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రివీల్ చేయడం అనుమానాలకు తావిస్తోంది. అసలు సర్వే తీరుపైనే సందేహాలు వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది. సెప్టెంబర్‌లోనే ఈ సర్వే చేసినట్లు టౌమ్స్ నౌ ప్రకటించడం మరింత అనుమానాలకు కారణమైంది.
సహజంగానే వ్యతిరేకత..
బీఆర్‌ఎస్‌పై రాష్ట్రంలో చాలా వరకు వ్యతిరేకత ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ కొన్ని హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారు. కేవలం పెన్షనర్లు, రైతులను మాత్రమే నమ్ముకుని మూడోసారి గెలవాలని చూస్తున్నారు. యూత్ ఓట్లు తనకు పడవని ఇప్పటికే డిసైడ్ అయిన గులాబీ బాస్.. వచ్చే ఎన్నికల్లో ఆసరా పెన్షన్ పెంచాలని, రైతుబీమాకు నోచుకోని రైతులకు పెన్షన్ ఇచ్చే పథకాలకు రూపకల్పన చేస్తున్నారు.
ఉద్యోగులు, నిరుద్యోగుల్లో తీవ్ర త్యతిరేకత..
ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగుల్లో బీఆర్‌ఎస్ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఉంది. వేతనాలు కూడా సమయానికి ఇవ్వడం లేదు. పెండింగ్ బిల్లుల కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఇక నిరుద్యోగులు అయితే ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. ఎప్పుడు కేసీఆర్‌ను గద్దె దించుదామా అని చూస్తున్నారు. ఉద్యోగాల భర్తీలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమవ్వడమే ఇందుకు కారణం. ఇక టీఎస్‌పీఎస్సీ తీరు, ఉద్యోగాల భర్తీలో తెరచాటు వ్యవహారాలు జరుగుతన్నాయన్న అనుమానాలు రేకెత్తిస్తోంది. నోటిఫికేషన్లు ఇచ్చినా ఉద్యోగాలు రావని నిరుద్యోగులు డిసైడ్ అయ్యారు. కేసీఆర్ గద్దె దిగితేనే ఉద్యోగాల భర్తీ సాధ్యమవుతుందని అనుకుంటున్నారు.
కుటుంబా పాలనపై అవగాహన..
ఇక కుటుంబ పాలన.. ఈ అంశం గురించి తొమ్మిదేళ్లుగా తెలంగాణ ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పూర్తిగా అవగాహన వస్తోంది. తెలంగాణలో బాగుపడ్డది ఎవరైనా ఉన్నారా అంటే అది కేసీఆర్ కుటుంబమే అని చిన్న పిల్లవాడి నుంచి పండు ముసలి వరకు చెబుతున్నారు. ఇందుకు కేసీఆర్ తీరే కారణం. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన కూతురును ఎమ్మెల్సీ చేయడంతోపాటు కేబినెట్‌లో తన కొడుకు, మేనల్లుడిని తీసుకోవడం, తన సామాజిక వర్గానికి చెందిన ఎర్రబెల్లికి మంత్రి పదవి ఇవ్వడం.. తనకు మందులు ఇచ్చే సంతోష్‌రావును రాజ్యసభకు పంపడం వంటి అంశాలు ప్రజలకు పూర్తిగా తెలిశాయి.
కేంద్రంలో ఏం చేస్తుందని..
ఇక ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో ఫలితాలు జాతీయ పార్టీలకు అనుకూలంగా వస్తున్నాయి. తెలంగాణలో కూడా అలాగే జరిగింది. ప్రాంతీయ పార్టీలు దేశ రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపవని ప్రజలు డిసైడ్ అయ్యారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు, లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలకు ఓట్లు వేస్తున్నారు. ప్రాంతీయ పార్టీల ఎంపీలను ఎంపీలుగా ఎన్నుకున్నా ప్రయోజనం ఉండదని గుర్తించారు. ఇలాంటి పరిస్థితిలో టౌమ్స్‌నౌ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా సర్వే ఫలితాలు ప్రకటించడంతో సర్వే ఫలితాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెయిడ్ సర్వేగా మెజారిటీ తెలంగాణ సమాజం అభిప్రాయపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బూస్ట్ ఇవ్వడానికే ఈ సర్వే ఫలితాలను ఇప్పించారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరి టౌమ్స్‌నౌ సర్వే ఎంత వరకు నిజమవుతుందో తెలియాలంటే 2024 మే వరకు ఆగాల్సిందే..!