మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్ పల్లిలో బోరుబావిలో పడ్డ చిన్నారి సాయివర్ధన్ నిన్న ఉదయం మృతి చెందాడు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.
నిరుపయోగంగా ఉన్న బోరుబావులను వెంటనే మూసివేయాలని పవన్ కోరారు. నిర్లక్యం చేస్తే మరింత ప్రమాదమని, ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ‘నోరు తెరిచిన బోరుబావులకు కళ్లెం వేయాలి.’ అని పవన్ కామెంట్ చేశారు.
ఈ విషాద ఘటనలో 12 గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ లో 17 అడుగుల లోతు వద్ద మృతదేహం లభించింది. గురువారం ఉదయం 5.45 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు వెలికితీశాయి. ఆక్సిజన్ అందకపోవడం వల్లే బాలుడు మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు. భిక్షపతి బుధవారం రోజు తన పొలంలో బోర్లు వేశాడు. రెండు బోర్లు వేసినా నీళ్లు పడకపోవడంతో మూడో బోరు బావిని కూడా తవ్వించారు. ఐతే ఆయన మనవడు సాయి వర్ధన్ తల్లిదండ్రులతో కలిసి పొలానికి వచ్చాడు. బోర్లు వేసిన అనంతరం ఇంటికి వెళ్తున్న సమయంలో.. అతడు ఆడుకుంటూ వెళ్లి ఓ బోరుబావిలో పడిపోయాడు. వారి పొలంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.