Pawan Kalyan- CM Jagan: ‘రణ’స్థలం నుంచే పవన్ తన యుద్ధాన్ని ప్రకటించారు. ప్రభుత్వ పెద్ద నుంచి పాలేర్లుగా చెప్పుకునే వారి వరకూ అందర్నీ ఏకి పడేశారు.పదునైన మాటలు, వ్యంగ్యోక్తులతో వైసీపీ పాలకులపై విరుచుకు పడ్డారు. ఎక్కడా పేర్లు సంభోదించకున్నా జన సైనికులకు అర్ధమయ్యేలా కామెంట్స్ చేశారు. కొత్త కొత్త పేర్లతో తూలనాడుతూ జన సైనికులకు కనువిందు చేసే వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేస్తూ ఉగ్రరూపం చూపించారు. తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్న ఏ ఒక్కర్నీ వదల్లేదు. దీటైన జవాబిచ్చారు. సీఎం జగన్ పేరు ప్రస్తావించకుండానే కొత్త పేరు పెట్టారు. మూడు ముక్కుల ముఖ్యమంత్రి అంటూ పదే పదే సంబోధించారు. ఇదేదో క్యాచీగా ఉందంటూ జన సైనికులు కూడా అనుసరించడం ప్రారంభించారు. ఈ కొత్త పేరు ఏపీ నాట బహుళ ప్రాచుర్యం పొందడం ఖాయమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక నుంచి జనాలు కూడా అదే పేరుతో పిలిచే చాన్స్ ఉన్నట్టు విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.

పవన్ తన ప్రసంగంలో తనపై వ్యక్తిగత కామెంట్స్ చేసే వారికి ప్రాధాన్యం ఇచ్చారు. అంబటి రాంబాబుకు డైరెక్ట్ వార్నింగే ఇచ్చారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన అంబటి తన ముందుకు వచ్చి మాట్లాడాలని సవాల్ చేశారు. ఆయనకు బడితె పూజ ఖాయమన్నారు. గంజాయి తాగి సంబరాల రాంబాబు ఎదైనా మాట్లాడవచ్చన్నట్టు రీతిలో వ్యవహరిస్తున్నారని.. ఓరెయ్ నేను మీకు దేవుడ్ని రా.. వచ్చి నా కాళ్లు పట్టుకోవాలంటూ సలహా ఇచ్చారు. ఇక రోజాపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఆటెన్ రాజా, రాణి అంటూ సంభోదిస్తూ పవన్ కామెంట్స్ సాగాయి. గుడివాడ అమర్నాథ్ గురించి ప్రస్తావిస్తూ.. వెధవ నీ పేరు గుర్తుపెట్టుకోవాలా అంటూ సెటైర్లు వేశారు.
సలహాదారుడు సజ్జల రామక్రిష్ణారెడ్డికి అయితే ఎడాపెడా వాయించేశారు. సలహా ఇచ్చేవాడు సజ్జల అయితే రాష్ట్రం సర్వనాశనమేనన్నారు. చచ్చు సలహాలకు చిరునామా సజ్జల అని కామెంట్స్ చేశారు. నామీద ఇంటెలిజెన్స్ ఎందుకు పెడతారని.. అడిగితే నేనే అన్నీ చెబుతా కదా అంటూ ఎద్దేవా చేశారు. పనిలో పనిగా పోలీస్ బాస్ పై కూడా చలోక్తులు విసిరారు. నా గురించి ఖైదీ 6093 నా గురించి మాట్లాడితే ఎలా డీజీపీ గారు అంటూ ప్రశ్నించారు. మీరు ఒక ఖైదీకి సెల్యూట్ చేస్తున్న విషయం గుర్తించుకోవాలన్నారు.

మధ్యలో గంజాయి కథతో పవన్ రక్తికట్టించారు. ఈ మధ్యన ఏపీ నుంచి వెళ్లే శీలవతి అనే గంజాచి ప్రపంచ ఫేమస్ అయ్యిందని.. బహుశా అది తాగే అవాకులు చెవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు. మీ నాన్ననే ఎదుర్కొన్నాను.. పంచలూడదీస్తానని హెచ్చరించాను.. నువ్వో లెక్క మూడు ముక్కుల ముఖ్యమంత్రి అంటూ ఎద్దేవా చేశారు. స్కూల్ జీవితం నుంచి మీ చరిత్ర అంతా తెలుసునన్నారు. సంబరాల రాంబాబు ఒకడున్నాడు.. వాడు.. వాడి ముదురు బెండకాయ ముఖం అంటూ ఏకి పడేశారు. తాము మాత్రమే బాగుండాలన్నది వైసీపీ నేతల నైజమన్నారు. అన్ని కులాలు బాగుండాలన్నదే తన అభిమతమన్నారు. పవన్ ప్రసంగం కొనసాగించినంత సేపు జన సైనికులు తమ హర్షధ్వానాలతో స్వాగతించారు.