BRS : ఆంధ్రా దోపిడీ.. బీఆర్ఎస్ సహకారం.. మావోయిస్టుల లేఖ సంచలనం

గోదావరి ఇసుక లభ్యత ఉండే పరివాహక ప్రాంతాల్లో మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తుండడంతో మావోయిస్టు పార్టీ నాయకులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వరుస లేఖలు విడుదల చేస్తున్నారు.

Written By: Bhaskar, Updated On : May 4, 2023 10:12 pm
Follow us on

BRS : “నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర వ్యాపారుల దోపిడీ ఎక్కువైపోయింది. రాష్ట్ర సమితి వంత పాడుతోంది. ఈ విధానం సరైంది కాదు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సబండవర్ణాలకు మోసమే జరుగుతోంది. ప్రజా ఉద్యమాలను అణచివేసే కుట్ర జరుగుతోంది. నాడు ఉద్యమాల్లో పాల్గొన్న అధికార పార్టీ.. నేడు ఆ ఉద్యమాలు చేస్తున్న వారిని పోలీసులతో అణగదొక్కుతుండడం విచారకరం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలతో పాటు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ” మావోయిస్టు పార్టీ ప్రభుత్వాన్ని తూర్పారబట్టింది. అంతేకాదు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా నిరసించింది.

ఎందుకు ఈ ఆగ్రహం

వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరంగల్లో శృతి ఎన్కౌంటర్ ద్వారా తన విధానం ఏమిటో కేసీఆర్ మావోయిస్టులకు చెప్పకనే చెప్పారు. ఉద్యమంలో ఉన్నప్పుడు మావోయిస్టు పార్టీ విధానమే తమ విధానమని చెప్పారు. చివరికి అధికారం దక్కించుకున్న తర్వాత ఆయన పల్లవి మారిపోయింది. దీంతో మావోయిస్టు పార్టీ నాయకులకు, అధికార పార్టీ నాయకులకు అంతరం పెరిగిపోయింది. ప్రభుత్వం కూడా ఉద్యమాలను అణిచివేసే చర్యలకు దిగడంతో మావోయిస్టులు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. పైగా అధికార పార్టీ తన అధికార బాహుల్యాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఆంధ్ర ప్రాంతపు కాంట్రాక్టర్లకు విరివిగా పనులు ఇస్తుండటం మావోయిస్టులకు నచ్చడం లేదు. పైగా గోదావరి ఇసుక లభ్యత ఉండే పరివాహక ప్రాంతాల్లో మొత్తం ఆంధ్ర కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తుండడంతో మావోయిస్టు పార్టీ నాయకులు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వరుస లేఖలు విడుదల చేస్తున్నారు.

ఇసుక అమ్ముతున్నారు

” మిడ్ మానేరు లో ఇసుక తీయడం వల్ల నీటి ఎద్దడి ఏర్పడి పంటలు పండవు. ఈ కేసు వేసిన తర్వాత దీనికి సంబంధించిన పనులను మైనింగ్ శాఖ నిలిపివేసింది. అధికార పార్టీ అండతో సుల్తానాబాద్, వీణవంక నుంచి మొదలుకొని గోదావరి కలిసే వరకు ఇప్పటికీ ఇసుక తీస్తూ అమ్ముతున్నారు. టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లి, కాల్వపల్లి, చలి వాగు, వాగుడుపల్లి గ్రామాలలో ప్రస్తుతం స్థానిక నాయకులు దగ్గరుండి మరి ఇసుక తీసి విక్రయిస్తున్నారు”ని మావోయిస్టు పార్టీ జయశంకర్, మహబూబాబాద్, వరంగల్ (2), పెద్దపల్లి డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో విడుదలైన లేఖ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.

పెసా కు వక్రభాష్యం

వాస్తవానికి గోదావరి నదిలో పెసా చట్టం ప్రకారం ఇసుక తీయాలి. కానీ మధ్య దళారులు ఆదివాసుల పేరుతో కాంట్రాక్టు తీసుకుని ఇసుకను అక్రమంగా విక్రయిస్తున్నారు. అనుమతికి మించి ఎక్కువ ఇసుక తోడేస్తున్నారు. దీనిపై ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. పైగా ఇందులో ప్రభుత్వ పెద్దల హస్తము ఉందని మావోయిస్టు పార్టీ ఆరోపిస్తోంది. కాలేశ్వరం దగ్గర గోదావరి నదిలో అక్రమంగా కొత్తగా రోడ్డు నిర్మాణం చేసి ఇసుకను తీసుకొని వెళ్తున్నారు. ప్రజలు ఫిర్యాదు చేసినప్పటికీ స్థానిక యంత్రాంగం చోద్యం చూస్తోంది. వరంగల్ హనుమకొండ మధ్యలో ఉన్న ఆకేరు వాగులో ఇసుక, కటాక్ష పూర్ దగ్గర మట్టి అక్రమంగా తోడేస్తూ విక్రయిస్తున్నారు. అంతేకాదు కాటారం చెరువులో మట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు. అంతేకాదు అడవుల్లో, గుట్టలో మట్టిని తవ్వి దర్జాగా రోడ్లు నిర్మిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు అడ్డగోలుగా లంచాలు స్వీకరించి ప్రకృతి వనరులను మొత్తం ధ్వంసం చేస్తున్నారని మావోయిస్టు పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మావోయిస్టులు విడుదల చేసిన లేఖ రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నది.