AP Formation Day 2023: ఆ రాష్ట్రాలు పుట్టింది ఈరోజే.. నవంబర్‌ 1న ఏడు రాష్ట్రాల ఆవిర్భావం!

పూర్వపు మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను హైదరాబాద్‌లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలతో విలీనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. అయితే ఇది అంత సులభంగా ఏర్పడలేదు.

Written By: Raj Shekar, Updated On : November 1, 2023 10:32 am

AP Formation Day 2023

Follow us on

AP Formation Day 2023: భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం అప్పటి ప్రభుత్వం రాష్ట్రాల పునర్విభజన చేపట్టింది. ఇందుకోసం రాష్ట్రాల పునర్వ్యవస్తీకరణ చట్టం రూపొందించింది. దీని ప్రకారం 1956, నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆవిర్భవించింది. దేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన తొలి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశే. ఈ ప్రాంతీయ భాషలో లోతైన సాహిత్య సంప్రదాయాన్ని కలిగి ఉన్న రాష్ట్రానికి తెలుగు అధికారిక భాషగా ఉంది. భారతదేశం ఆగ్నేయ తీరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు దక్షిణాన తమిళనాడు, నైరుతి, పశ్చిమాన కర్ణాటక, వాయువ్య, ఉత్తరాన తెలంగాణ, ఈశాన్య సరిహద్దులో ఒడిశా ఉన్నాయి. 1.60 లక్షల కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఆంధ్రప్రదేశ్‌ విస్తీర్ణంలో దేశంలో ఏడవ అతిపెద్ద రాష్ట్రం. ఇక ఇదే నవంబర్‌ 1న దేశంలో ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఏర్పడ్డాయి. ఇందులో లక్షద్వీప్, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాలు వేర్వేరు సంవత్సరాల్లో నవంబర్‌ 1వ తేదీననే ఆవిర్భవించాయి.

ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటుకు ఉద్యమం..
పూర్వపు మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను హైదరాబాద్‌లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలతో విలీనం చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది. అయితే ఇది అంత సులభంగా ఏర్పడలేదు. 1952లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం బలమైన ఉద్యమం జరిగింది. ఆ క్రమంలో ఉద్యమకారుడు పొట్టి శ్రీరాములు 1952, అక్టోబర్‌ 19న ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించాడు. శ్రీరాములు నిరాహార దీక్ష చాలా ప్రజా అశాంతికి దారితీసింది. ఆ నేపథ్యంలోనే శ్రీరాములు నిరసన ప్రారంభించిన 58 రోజుల తర్వాత డిసెంబర్‌ 15న మరణించారు. ఇది ఆంధ్రాలోని అనేక ప్రాంతాల్లో అల్లర్లు, హింసను ప్రేరేపించింది. పోలీసుల కాల్పులకు దారితీసింది. ఈ ఆందోళనలో పలువురు చనిపోయారు. దీంతో నెహ్రూ చివరికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. ఏడాది తర్వాత 1953, అక్టోబర్‌ 1 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. దీని రాజధాని కర్నూలు. తరువాత 1956, నవంబర్‌ 1 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్‌లో విలీనం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడింది.

2014లో ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన..
ఇక 2014లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి తెలంగాణ విడిపోయింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన కోసం కూడా పెద్ద ఉద్యమమే జరిగింది. ప్రత్యేక రాష్ట్రమే ఎజెండాగా కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి దాదాపు 13 ఏళ్లు పోరాడారు. ఇందుకోసం సబ్బండ వర్గాలను ఏకం చేశారు. అనేక పోరాటాలు, ఆందోళనలు, బలిదానాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన జరిగింది. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వేర్వేరు రాష్ట్రాలుగా అవతరించాయి. తర్వాత తెలంగాణలో 20 కొత్త జిల్లాలు ఏర్పాటు కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక కొత్తగా 13 జిల్లాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు, ఏపీలో 26 జిల్లాలు ఉన్నాయి.