Janasena BJP Alliance
Janasena BJP Alliance: తెలంగాణ ఎన్నికలకు ఇంకా నెల రోజుల గడువు కూడా లేదు. రెండ రోజుల్లో నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టిపెట్టాయి. అభ్యర్థుల ప్రకటనలో వెనుకబడిన బీజేపీ కూడా నేరో రేపో అభ్యర్థులను ప్రకటించి ప్రచారం మొదలు పెట్టాలనుకుంటోంది. ఎన్డీఏలో భాగస్వామి అయిన జనసేనతో కలిసి తెలంగాణ ఎన్నికల బరిలో దిగాలని బీజేపీ ఇప్పటికే నిర్ణయించింది. అయితే సీట్ల విషయంలో కొనసాగుతున్న చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయి. తెలంగాణలో జనసేనకు 11 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది.
కూకట్‌పల్లిని వదులుకోనున్న బీజేపీ..
పొత్తులో భాగంగా బీజేపీ కూకట్‌పల్లి స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది. జనసేన ఈ స్థానం కోసం పట్టుపట్టడంతో తప్పనిసరి పరిస్థితిలో బీజేపీ ఇందుకు అంగీకరించింది. ఈమేరకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. పొత్తుల్లో భాగంగా జనసేనకు కూకల్‌పల్లితోపాటు ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దులు పంచుకున్న ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిగతా స్థానాలను కేటాయించే అవకాశం ఉంది.
మూడో జాబితాపై బీజేపీ కసరత్తు..
మరోవైపు బీజేపీ తదుపరి అభ్యర్థుల జాబితాపై అధిష్టానంతో చర్చించేందుకు మంగళవారం ఢిల్లీ చేరుకున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డాతో రాత్రి సమావేశమయ్యారు. బీజేపీ తెలంగాణ ఎలక్షన్స్ ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్, తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ తదితరులు కూడా చర్చలు జరిపారు. మొత్త 119 స్థానాల్లో రెండు విడతలుగా 53 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మిగతా 66 స్థానాల్లో జనసేనకు ఇవ్వనున్న స్థానాలను మినహాయించి, అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. బుధవారం రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో మిగతా స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. నవంబర్ 25న రాజస్థాన్, నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీలకు పోలింగ్ జరుగునుంది. తెలంగాణలో నవంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.