కల చెదిరిన జర్నలిస్ట్ బ్రతుకులు

కాలం ఒడిలో జర్నలిస్టుల జీవితాలు కరిగిపోయాయి. పత్రికా యాజమాన్యాల కబంధ హస్తాల్లో నలిగిపోయాయి. ఒకరేమో దేశ అత్యున్నత పురస్కార గ్రహీత.. మరొకరేమో కొత్త పలుకుల లాబీయింగ్ వ్యాపారి.. మరొకరేమో అగ్రకులాల అధిపతి. ఈ ముగ్గురికి మూడు పత్రికలు.. ఇప్పుడు రెండు పత్రికల జర్నలిస్టులు రోడ్డునపడ్డారు. మూడో రెడ్డి రాజ్యపు అధిపతి అదే పనికి సిద్ధంగా ఉన్నారు. గడిచిన రెండు మూడు రోజులుగా జర్నలిస్టుల ఆవేదన, ఆక్రందన కళ్లకు కట్టేలా.. కన్నీరు కార్చేలా సోషల్ మీడియాలో పోస్టుల పరంపర […]

Written By: NARESH, Updated On : July 28, 2023 12:07 pm
Follow us on


కాలం ఒడిలో జర్నలిస్టుల జీవితాలు కరిగిపోయాయి. పత్రికా యాజమాన్యాల కబంధ హస్తాల్లో నలిగిపోయాయి. ఒకరేమో దేశ అత్యున్నత పురస్కార గ్రహీత.. మరొకరేమో కొత్త పలుకుల లాబీయింగ్ వ్యాపారి.. మరొకరేమో అగ్రకులాల అధిపతి. ఈ ముగ్గురికి మూడు పత్రికలు.. ఇప్పుడు రెండు పత్రికల జర్నలిస్టులు రోడ్డునపడ్డారు. మూడో రెడ్డి రాజ్యపు అధిపతి అదే పనికి సిద్ధంగా ఉన్నారు.

గడిచిన రెండు మూడు రోజులుగా జర్నలిస్టుల ఆవేదన, ఆక్రందన కళ్లకు కట్టేలా.. కన్నీరు కార్చేలా సోషల్ మీడియాలో పోస్టుల పరంపర కొనసాగుతోంది. లాంగ్ లీవుల పేరిట ఈనాడు బలిపశువు చేసిందని కొందరు.. ‘హోల్డ్’ పేరిట ఆంధ్రజ్యోతి ఇంటికి పంపించిందని మరికొందరు జర్నలిస్టులు సభ్య సమాజానికి లేఖలు రాస్తున్నారు. కానీ ఎంత రాసినా.. ఎంత రోదించినా వారి వేదన అరణ్య రోదనే అవుతోంది.

ఈనాడు సంస్థల అధిపతి రామోజీరావును ఇప్పుడు అందరూ కీర్తిస్తున్నారంటే.. ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం ‘పద్మ విభూషన్’ వచ్చిందంటే ఖచ్చితంగా అది ఈనాడు మీడియా ఘనతే. ఆయనకు పత్రిక, టీవీ అండగా లేకపోతే ఆయన ఒక పచ్చళ్ల వ్యాపారిగానే మిగిలిపోయేవారు. ఒక చిట్ ఫండ్ వసూల్ రాజాగానే కొద్దిమంది మదిలో ఉండేవారు.. కానీ ఆయనను దేశ పటంలో నిలబెట్టింది ఈనాడు పత్రిక. ఆ పత్రికను రాత్రిబవంళ్లు నిద్రహారాలు లేకుండా పనిచేసిన జర్నలిస్టులు. ఇప్పుడు ఆ జర్నలిస్టులే రోడ్డున పడ్డ పరిస్థితి.

తాజాగా ఈనాడు జర్నలిస్టులను లాంగ్ లీవుల పేరిట రెండు నెలల పాటు పక్కనపెట్టిందని వారు బోరుమంటున్నారు. సోషల్ మీడియా వాట్సాప్ లలో ఉబికివస్తున్న కన్నీళ్లను అదిమిపట్టుకుంటూ పోస్టులు పెడుతున్నారు. లాంగ్ లీవుల పేరిట సాగనంపిన దుర్మార్గాన్ని కళ్లకు కడుతున్నారు. రెండు నెలల కాలానికి జీతాలు ఇస్తారో లేదో తెలియదు. ఇక ఇచ్చినా మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకుంటారో తెలియదు. ఇంతటి దుర్భర స్థితిలో ఈనాడు జర్నలిస్టులు నరకయాతన అనుభవిస్తున్నారు.

ఇక ఆంధ్రజ్యోతి సంగతి. కొత్త పలుకుల పేరిట ప్రతీవారం వీకెండ్ లో సమాజానికి హితబోధ చేసే ఆంధ్రజ్యోతి యజమాని రాధాకృష్ణ కూడా ఇంత నిర్ధయగా ఆంధ్రజ్యోతి జర్నలిస్టులను రోడ్డున పడేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. బేసిక్ గా జర్నలిస్టు నుంచి వచ్చిన రాధాకృష్ణకు జర్నలిస్టుల కష్టాలు, నష్టాలు తెలుసు. కానీ అవన్నింటిని పక్కనపెట్టి ఉద్యోగుల ఉసురు తీసేశాడు. పెట్టుబడి దారీ సామ్రాజ్య పోకడలో తను అతీతం కాదని నిరూపించుకున్నాడు. జర్నలిజం గురించి అంతా తెలిసిన రాధాకృష్ణ తన పేపర్ లో చెప్పే నీతులు కోటలు దాటుతాయి. సమాజాన్ని ఉద్దరించడానికే వచ్చిన యుగపురుషుడిలా ఆయన మాటలుంటాయి. ఇన్నాళ్లు అందరూ ఆయనను కీర్తించారు. కానీ ఇప్పుడు తన సంస్థలోని ఉద్యోగులను అంత నిర్ధయగా వదిలించుకున్న తీరు చూశాక.. ఆయన మాటల్లో ఉన్న ఉదారత.. చేతల్లో లేదని తేటతెల్లమైంది.. ఇప్పుడు వారం వారం ఎలా తన పత్రిక ఎడిటోరియల్ లో మెసేజ్ ఇస్తాడో వేచిచూడాలి. ముందు తన దుకాణం సరిగా నిర్వహించకుండా సమాజానికి ఎలా ఈ పెద్దమనిషి సూక్తులు చెబుతాడో చూద్దాం.

నిజానికి ఈ ఇద్దరు పెద్దమనుషులు కరోనాతో అల్లాడిపోయి నష్టపోయి సంస్థలోని ఉద్యోగులను వదిలించుకున్నారంటే ఎవరూ నమ్మని పరిస్థితి. నిన్నగాక మొన్ననే ఈనాడు రామోజీరావు కరోనాపై పోరులో 20 కోట్లు రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ఇచ్చాడు. అందులోంచి ఒక కోటి తీసి నీ ఉద్యోగులకు రెండు నెలలు జీతాలు ఇవ్వలేవా అని ఇప్పుడు ఆ సంస్థ ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. ఇక మొన్నటివరకు చంద్రబాబు పాలన.. ఆయనకు వెన్నుదన్నుగా టీడీపీ పత్రికలా సర్వం లాభపడ్డ ఆంధ్రజ్యోతి కరోనాతో నష్టపోయిందంటే ఎవరూ నమ్మని పరిస్థితి. నిన్నటికి నిన్న మున్సిపల్, సర్పంచ్, పరిషత్ ఎన్నికలతో కోట్ల యాడ్స్ రిపోర్టర్లు కలెక్ట్ చేశారు. ఆ సొమ్మంతా తీసుకున్న రాధాకృష్ణ ఎక్కడ పెట్టారు. ఒక నెల జీతాలు ఇవ్వలేనంత డొల్ల కంపెనీయా ఆంధ్రజ్యోతి. అలాంటప్పుడు ఎందుకీ ఇంత బీరాలు.. మొత్తం మూసివేయచ్చు కదా అని జర్నలిస్టులు మిత్రులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు లాక్ డౌన్ విధించిన 17 రోజులకే సంస్థ నష్టాల్లోకి కూరుకుపోయిందని 70శాతం ఉద్యోగులను సాగనంపిన వైనం కూర్రంగా ఉందని తూలనాడుతున్నారు.

ఈనాడు, ఆంధ్రజ్యోతి రెండు సంస్థలు నష్టపోయిందన్నది శుద్ధ అబద్దమని ఆ సంస్థను నడిపిస్తున్న కీలక వ్యక్తులే చెబుతున్నారు. కేవలం జర్నలిస్టులను తొలగించుకోవాలని.. భారం తగ్గించుకోవాలని.. కరోనాను సాకుగా చూపి వీరు ఆడుతున్న వికృత క్రీడలో పాపం జర్నలిస్టులే బలిపశువులవుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

పాపం జర్నలిస్టులు.. వీరి మాయలో పడి ఇన్నాళ్లు పగలనక.. రాత్రనక వార్తల కోసం, పత్రికలకు యాడ్స్ కోసం తమ రక్తం చిందించారు. ఇప్పుడు నడిరోడ్డున పడేసిన వేళ మౌనంగా రోదిస్తున్నారు. ఏరుదాటాక తెప్ప తగేలేసిన ఈ పత్రిక యాజమాన్యాల తీరుతో మానసికంగా కృంగిపోతున్నారు.

జర్నలిస్టులకు మానాభిమానాలు చాలా ఎక్కువ. ఎవ్వరి ముందు చేయి చాపరు. ఆకలితో అలమటిస్తారు. అవసరమైతే ప్రాణాలు తీసుకుంటారు.. కానీ యాచించరు. అలాంటి గొప్ప గుణం ఉన్న వేలాది మంది రోడ్డునపడ్డారు. పత్రికల కాఠిన్యానికి ఏ ఆధారం లేకుండాపోయారు. వారి కుటుంబాలు గడిచేదెల? ఏమైనా చేసుకుంటే ఆ పాపం ఖచ్చితంగా ఆ పత్రిక యాజమాన్యాలకే తగులుతుంది. రామోజీ, రాధాకృష్ణలకే దీనికి బాధ్యులనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక ఇంతమందిని తీసేసి.. ఇంతమంది జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా.. మన జర్నలిస్టు సంఘాలు మాత్రం కళ్లుండి చూడలేని కబోదుల్లా ఉండడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. మీడియాపై ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుంటే రోడ్డెక్కే జర్నలిస్టు సంఘాలు.. ఇంతమంది రోడ్డున పడితే ఏం చేస్తున్నారని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. యాజమాన్యాలకు అమ్ముడు పోయారా అని నిలదీస్తున్నారు. తోటి జర్నలిస్టులను బలిపశువును చేస్తున్నా స్పందించని మీ సంఘాలు ఉంటే ఎంత పోతే ఎంత అని ఆవేదనతో అడుగుతున్నారు..

ఇప్పటికైనా కాబోయే జర్నలిస్టులారా? మీకిదే మా చిన్న విన్నపం.. మీరు ఏదైనా కండి.. కానీ మాలాగా జర్నలిస్టులు కాకండి.. మీడియా యాజమాన్యాల చేతిలో బలిపశువు కాకండి.. మా పరిస్థితి చూసైనా ఈ ఫీల్డ్ లోకి రాకండి అని తీసేసిన జర్నలిస్టులు కోరుతున్నారు. నిజంగా మీడియా యాజమాన్యాల తీరు చూస్తుంటే భవిష్యత్తులో అసలు జర్నలిస్ట్ అనే వాడు పుస్తకాల్లో తప్పితే నిజం జీవితంలో ఉండడేమోనన్న సందేహం కలుగుతోంది.

దేవుడా.. ఈ మా జర్నలిస్టులను నువ్వే కాపాడు.. !