ఆంధ్రప్రదేశ్ లో వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుండి ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. గవర్నర్ ఆమోదించడంతో విశాఖకు రాజధాని తరలించేందుకు జగన్ సర్కారు ఇటీవల వేగం పెంచింది. విపక్షాలకు చెక్ పెడుతూ నిర్ణయం తీసుకున్న జగన్ ఇప్పుడు కూడా హైకోర్టు వారి నిర్ణయాన్ని ఛాలెంజ్ చేసే దిశగా ప్రయాణిస్తున్నాడు. ఈ మేరకు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. తాజాగా అత్యవసర విచారణ చేపట్టాలని ప్రధాన న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది.
ఇదిలా ఉండగా మూడు రాజధానులు బిల్లు ను గవర్నర్ ఆమోదించినా…. ఏపీ హైకోర్టు మాత్రం ఈ నెల 14 వరకు స్టేటస్ కో విధించిన విషయం తెలిసిందే. దీని పై స్టే విధించాలని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే విచారణకు రాకపోవడంతో అత్యవసరంగా విచారించాలని సుప్రీంకోర్టు వారికి జగన్ రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశం అయింది. కరోనా సంక్షోభ సమయంలో అసలు ఈ రాజధాని గొడవ ఏమిటంటూ రాష్ట్ర ప్రజలు మరోపక్క ఆశ్చర్యపోతున్నారు. అంత అత్యవసర విచారణ జగన్ కు అవసరం ఏముందని ఇక్కడి ప్రశ్న? ఆగస్టు 16న ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖ రాజధాని శంకుస్థాపన చేయాలని జగన్ నిర్ణయించుకున్నారని… దాని కోసం కోర్టు వారిని పట్టుబట్టేందుకు సిద్ధపడ్డారన్న మాటలు వినిపిస్తున్నాయి.
ఇక ఇదే సమయంలో ఏపీ పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు పై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఎత్తివేయాలంటూ ఏపీ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ కు లేఖ రాసింది. ప్రతివాదులకు పిటిషన్ కాపీ పంపినందున వీలైనంత త్వరగా కేసుపై విచారణ జరపాలని ప్రభుత్వం లేఖలో కోరింది. అసలు ప్రతివాదులకు పిటిషన్ పంపడం ఆనవాయితీ అయినా దానివల్ల విచారణ త్వరగా జరపాలని ప్రభుత్వం కోరడంతో ఇప్పుడు ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో స్పీకర్ ను తొందర పెట్టినట్లు, గవర్నర్ ను ఇబ్బంది పెట్టినట్లుగా న్యాయస్థానాలను కూడా జగన్ ఇలా తొందర పెట్టడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరి దీనికి వైసిపి సపోర్టర్ల మాట ఏమిటో చూడాలి.