తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉంటూ…. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకూ ఓ వెలుగు వెలిగిన బడా నేతలు అంతా ఇప్పుడు అసలు అడ్రస్ లేకుండా పోయారు. అందరూ ఎంతో కొంత యాక్టివ్ గా ఉన్నా కూడా అమరావతిలో ఉన్న కొంతమంది నేతలు మాత్రం అస్సలు కనిపించడం లేదు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన పేరు పత్తిపాటి పుల్లారావుది. గత టీడీపీ ప్రభుత్వం లో రాజధాని అమరావతి ప్రాంతం నుండి ఆయన అత్యంత కీలక నేత. చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి. సీఆర్డీఏ చట్టంలో ఆయనది అత్యంత కీలక పాత్ర.
అంతెందుకు గత సంవత్సరం సార్వత్రిక ఎన్నికలకు ముందు వరకు వైసిపి పార్టీ పైన నిప్పులు చెరిగారు. జగన్ పేరు చెబితేనే అంత ఎత్తున లేచే ఆయన ఇప్పుడు మాత్రం జగన్ మూడు రాజధానులు ఏపీ లో స్థాపించేందుకు ఎన్నో ఎత్తుగడలు వేసినా కూడా కనీసం ఒక్క మాట కూడా ఎత్తడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. ఎప్పుడో అడపాదడపా ప్రెస్ మీట్ లలో తారసపడుతున్నా…. క్రియాశీలకంగా అతనికి ఉనికి మొత్తం పోయింది.
అసలు అంతటి నేత ఎందుకు మౌనంగా ఉన్నారన్న చర్చ ఇప్పుడు జోరుగా కొనసాగుతోంది. ఇక ఆ విషయానికి వస్తే స్సీఆర్డీఏ చట్టం అమలులో చాలా అవకతవకలు జరిగాయని…. అలాగే అమరావతి రాజధాని భూముల సేకరణ లో కూడా పత్తిపాటి పుల్లారావు చర్యలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని…. జగన్ ప్రభుత్వం అతనిపై అన్నీ సిద్ధం చేసి పెట్టుకుందని అధికార పార్టీ వర్గాల నుండి ఎన్నో మాటలు వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ పాలనలో జరిగిన అవినీతిని తవ్వుతామని…. వారిని తప్పక జైలుకు పంపుతామని వైసీపీ నేతలు పదేపదే చెబుతున్నారు. అంతే కాదు అచ్చెన్నాయుడు, జేసి ప్రభాకర్ రెడ్డి వంటి నేతలను కూడా శ్రీకృష్ణ జన్మ స్థలానికి పంపించారు. ఈ భయంతోనే పుల్లారావు మౌనంగా ఉన్నారని చర్చ సాగుతోంది.
మరికొందరైతే ఆయన ఏమి అవినీతికి పాల్పడలేదని…. కేవలం అమరావతి ప్రజలకు సమాధానం చెప్పలేక చెప్పుకోలేక ముఖం చాటేసుకుని తిరుగుతున్నారని అంటున్నారు. ఇక గతంలో పుల్లారావు కొడుకు పై అనేక ఆర్థిక దుశ్చర్య ఆరోపణలు ఉన్నాయి. కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ఇలా ఇన్ని సర్పాలు తనని కాటేసేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో పత్తిపాటి పుల్లారావు అసలు బయటకు రాకపోవడం లోఎటువంటి విచిత్రం లేదనే చెప్పాలి. మరి అసలు ఆయనపై ఉన్న ఆరోపణలు నిజమా కాదా అన్న విషయం తెలియాలంటే ఆయన బయటికి వచ్చి సమాధానం చెప్పి తీరాల్సిందే…. లేకపోతే మనకు ఎలా తెలుస్తుంది..?