Jagananna Amma Vodi: జగన్ నవరత్నాల్లో కీలక పథకం అమ్మ ఒడి. గత ఎన్నికల్లో మహిళలు ఓట్లు గుంపగుత్తిగా తెచ్చిన పథకమని రాజకీయ విశ్లేషకులు భావిస్తారు. కానీ మూడేళ్లలో రెండు సార్లు మాత్రమే అమ్మ ఒడి ప్రోత్సాహాన్ని అందించి జగన్ చేతులు దులుపుకున్నారు. కుటుంబంలో బడికి వెళ్లే చిన్నారులు ఉన్న ప్రతి తల్లికీ ఏటా రూ.15 వేలు చొప్పున ఇస్తామని 2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్ గొప్పగా ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చేశారు. కుటుంబంలో ఒక్కరికే ఈ పథకాన్ని పరిమితం చేశారు. అంతేకాదు.. ఇచ్చే మొత్తంలోనూ రెండో ఏడాది నుంచి స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.1,000 కోత పెట్టి రూ.14 వేలు చేతిలో పెట్టారు. జూన్ లో అందించే అమ్మ ఒడి మొత్తంలో ఏకంగా రూ.2000లు కోత విధించడానికి నిర్ణయించారు. మరుగుదొడ్ల నిర్వహణకు వినియోగించాలని సర్కారు భావిస్తోంది. వాస్తవానికి పాఠశాలల్లోని మరుగుదొడ్ల నిర్వహణకు సర్కారే నిధులు కేటాయిస్తుంది. అయితే, వైసీపీ హయాంలో నిధులు ఇవ్వడం ఆపేసి ‘అమ్మఒడి’ నుంచి మరుగుదొడ్ల నిర్వహణకు నిధులు మినహాయిస్తున్నారు. దీంతో అమ్మఒడి పథకంపై ఆశలు పెట్టుకున్న లబ్ధిదారులైన తల్లులు తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నారు.
నెలలు మార్చి..
వాస్తవానికి ఈ పథకాన్ని ఐదేళ్లపాటు అమలు చేయాల్సి ఉంది. అయితే.. నెలలు మార్చి.. ప్రభుత్వం దీనిని నాలుగేళ్లకే పరిమితం చేసింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో తొలి రెండేళ్లపాటు జనవరి నెలలో అమ్మఒడిని ఇచ్చిన ప్రభుత్వం.. ఈ ఏడాది ఆరు నెలలు ముందుకు జరిపి.. జూన్‌కు వాయిదా వేసింది. ఎందుకంటే 2022 జూన్‌లో ఇస్తే.. మళ్లీ 2023 జూన్‌లో ఇవ్వాలి. ఇక, 2024 మే నెలలోనే ఎన్నికలు వస్తాయి కాబట్టి ఆ ఏడాది ఈ పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉండదని సర్కారు ప్లాన్ వేసుకుంది. అలాకాకుండా జనవరిలోనే అమ్మఒడి ఇచ్చి ఉంటే.. 2023, 2024లోను జనవరిలోనే ఇవ్వాల్సి వస్తుంది. ఇది ప్రభుత్వంపై పెనుభారంగా పరిణమించింది. ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. నెలకు రూ.5 వేల కోట్లు అప్పు పుడితే కానీ గడవని పరిస్థితి నెలకొంది. అందుకే అమ్మ ఒడిలో భారీగా కోత పెట్టే పనిలో ప్రభుత్వం ఉంది.
Also Read: CM Jagan- Davos Meeting: సీఎం జగన్ లండన్ లో ఎందుకు దిగినట్టు?
ఇంటికి ఒక్కరికే..
ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికీ అమ్మఒడి ఇస్తామని జగన్ తో పాటు వైసీపీ నేతలు ప్రకటించారు. సాక్షాత్ జగన్ సతీమణి భారతి కూడా చాలా వేదికల్లో ఇదే విషయాన్ని ప్రకటించారు. ఆ ప్రచారం మహిళల్లోకి బాగా వెళ్లాక.. ‘ఇంటికి ఒక్కరికే’ అని సవరణ చేశారు. అది ఎంతమందికి చేరిందో తెలీదు కానీ.. ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా అమ్మఒడి ఇస్తారని భావించిన తల్లులందరూ వైసీపీకి ఓట్లేశారనే విశ్లేషణలు ఉన్నాయి. ఇక, అధికారంలోకి వచ్చాక అమ్మఒడి పథకం ఇచ్చేందుకు మద్యం ధరలు భారీగా పెంచారు. తద్వారా వచ్చే ఆదాయంతో ఈ పథకాన్ని అమలు చేశారు.
దీంతో అమ్మఒడి కోసం నాన్న బుడ్డి పెంచేశారనే విమర్శలు పెద్దఎత్తున వచ్చాయి. అమ్మ ఒడి సాకుగా చూపి గత ప్రభుత్వాల కాలం నుంచి ఇస్తున్న పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఆపేశారు.
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘విదేశీ విద్యోన్నతి’ పథకాన్ని పక్కన పెట్టారు. ఇంట్లో ఇద్దరు పిల్లలున్నా అమ్మఒడి ఇస్తామన్న జగన్.. తర్వాత దీనిని ఒక్కరికే పరిమితం చేశారు. అయితే.. ఇప్పుడు ఒక్క చిన్నారి ఉన్న తల్లికి కూడా చాలా మందికి ఈ పథకాన్ని వర్తింపజేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గత రెండేళ్లుగా దరఖాస్తులు చేసుకుంటున్న వారిలో వివిధ కారణాలు చెబుతూ వేల సంఖ్యలో దరఖాస్తులను పక్కన పెడుతున్నారు. మరోపక్క ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు పెరిగాయని.. దాదాపు ఐదారు లక్షల మంది విద్యార్థులు కొత్తగా చేరారంటున్న ప్రభుత్వం అ మేరకు అమ్మఒడి లబ్ధిదారులను పెంచడం లేదన్న ఆరోపణలున్నాయి.
Also Read:JanaSena Chief Pawan Kalyan : నవ నాయకత్వమే… తెలంగాణకు మార్గం!