CM Jagan- Davos Meeting: ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా అధికారిక పర్యటనకు వెళ్లినప్పుడు షెడ్యూల్ వెల్లడిస్తారు. అధికారికంగా ప్రకటన చేస్తారు. అధికారిక కార్యక్రమమైతే తప్పనిసరిగా తన వెంట అధికారులను తీసుకెళతారు. ఇందుకు సంబంధించి పక్కగా అధికారిక సమాచారం వెల్లడిస్తారు. కానీ అందుకు విరుద్ధంగా ఏపీ సీఎం జగన్ విదేశీ పర్యటన సాగుతుండడం చర్చనీయాంశమైంది. గుట్టుగా సాగుతుండడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం చెప్పినట్లు కాకుండా… మరోరకంగా ఎందుకు జరుగుతోంది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన… ముందస్తు షెడ్యూలు ప్రకారం కాకుండా, ‘డీవియేషన్ల’తో సాగవచ్చునా? తాజా పరిణామాలతో తలెత్తుతున్న అనుమానాలివి. ఎందుకంటే… ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, ముఖ్యమంత్రి జగన్ స్విట్జర్లాండ్‌లోని దావో్‌సకు వెళ్తున్నారు. ఈ బృందంలో జగన్ సతీమణి కూడా ఉన్నారని అందులో చెప్పలేదు. కానీ… శుక్రవారం ఉదయం 9.40 గంటలకు గన్నవరం నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో సతీసమేతంగా జగన్ బయలుదేరారు. శుక్రవారం సాయంత్రానికి జగన్ స్విట్జర్లాండ్‌లోని దావోస్ చేరుకుంటారని అధికారిక సమాచారం ఇచ్చారు. కానీ… ఆ విమానం రాత్రి 10.30 గంటల సమయంలో లండన్‌లో ల్యాండ్ అయ్యింది.
సస్పెన్స్..
భారత్ నుంచి దావోస్ వెళ్లేందుకు లండన్ దాకా వెళ్లాల్సిన అవసరమే లేదు. లండన్‌కంటే చాలా ముందే దావోస్ వచ్చేస్తుంది. అయినా సరే… సీఎం ప్రయాణించే విమానం లండన్‌లో దిగింది. దావో్‌సకు వెళ్లాల్సిన సీఎం లండన్‌లో ఎందుకు దిగారో తెలియడంలేదు. ప్రపంచ ఆర్థిక సదస్సులో మన రాష్ట్రం గురించి చెప్పి, పెట్టుబడులను ఆకర్షించేందుకు జగన్ దావోస్ వెళ్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ ఏర్పాట్లు చూసేందుకు కొందరు అధికారులు ముందే అక్కడికి చేరుకోవడం సహజం. మిగిలిన ఉన్నతాధికారులు సీఎంతోపాటే ప్రత్యేక విమానంలో వెళతారు. కానీ… శుక్రవారం సీఎం వెళ్లిన ప్రత్యేక విమానంలో జగన్, ఆయన సతీమణితోపాటు ఏవియేషన్ సలహాదారు భరత్ రెడ్డి మాత్రమే వెళ్లినట్లు సమాచారం.
Also Read: Jagan KTR: రహస్య చర్చలకే కేటీఆర్, జగన్ దావోస్ వెళుతున్నారా?
ఎక్కడా ఉన్నతస్థాయి అధికారులెవరూ కనిపించలేదు. అంటే జగన్ వ్యక్తిగత పర్యటనకు వెళుతున్నారా? అటువంటప్పుడు అధికార పర్యటన అని ఎందుకు చెబుతున్నారు? అసలు లండన్ లో దిగాల్సిన పని ఏమి వచ్చిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తనపై అవినీతి కేసులు నడుస్తున్న నేపథ్యంలో జగన్ సీబీఐ కోర్టు ప్రత్యేక అనుమతిని తీసుకున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి దావోస్ వెళుతున్నట్టు కోర్టుకు సమాచారమిచ్చారు. అందుకు అనుగుణంగా సీబీఐ కోర్టు అనుమతిచ్చింది. కానీ కోర్టుకు చెప్పిన దానికి విరుద్ధంగా లండన్ లో దిగడం ఏమిటన్నది ఇప్పుడు సరికొత్త వాదన. లండన్ లో కుటుంబసభ్యులను ఎవరినైనా కలుస్తారా? లేక కీలక చర్చలకు వేదికగా మలుచుకున్నారా? అన్నది తెలియడం లేదు. మరోవైపు దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో పెట్టుబడులు విషయంలో వైసీపీ ప్రభుత్వం ముందుగానే చేతులెత్తేసింది. పెట్టుబడులు ఆశించిన స్థాయిలో వస్తావన్న నమ్మకం లేదని సాక్షాత్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముందస్తుగానే చెప్పారంటే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు.
Also Read:Polavaram- Shivalingam: పోలవరంలో బయటపడిన శివలింగం ఏ కాలం నాటిది?