Chittoor SP Rishanth Reddy: పుంగనూరులో జరిగిన అల్లర్ల వ్యవహారంలో చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన కను సన్నల్లోనే ఇదంతా జరిగిందని టిడిపి ఆరోపిస్తోంది. వైసిపి కోసం గుడ్డలు చించుకొని మరి పని చేస్తారని ఆయనపై విమర్శలు ఉన్నాయి. ఈ ఘటన జరిగిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడిన తీరు.. జారీ చేసిన ప్రెస్ నోట్ సైతం వైసీపీకి అనుకూలంగా ఉంది. అయితే టిడిపి నేతల విషయంలో గతంలో కూడా రిశాంత్ రెడ్డి ఇదేవిధంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి.
తాజాగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కి చెందిన బీసీ వర్గానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి మీడియా ముందుకు వచ్చి… రిశాంత్ రెడ్డి ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొచ్చాడు. 2019 సెప్టెంబర్ 4న నర్సీపట్నంలో టిడిపి బైక్ ర్యాలీ నిర్వహించింది. అయితే ఆ కార్యక్రమానికి అనుమతి లేదనిపోలీసులు అడ్డుకున్నారు. దీనిని బాధ్యులు చేస్తూ కొంతమంది టిడిపి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ బైక్ ర్యాలీలో సంతోష్ కూడా పాల్గొన్నాడు. అదే నెల 13న సంతోష్ ను పోలీసులు అదుపులో తీసుకున్నారు.
నర్సీపట్నం పోలీస్ స్టేషన్ పై అంతస్తులో చీకటి గదిలో ఆయన్ని నిర్బంధించారు. అప్పుడు అదనపు ఎస్పీగా పని చేస్తున్న రిశాంత్ రెడ్డి తనపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు సంతోష్ చెబుతున్నారు. కాళ్లతో తన్ని,కర్రలతో పాదాల మీద కొట్టి చిత్రహింసలు పెట్టినట్లు గుర్తు చేశారు. తలపై రివాల్వర్ పెట్టి ఎన్కౌంటర్ చేస్తానని హెచ్చరించినట్లు చెప్పుకొచ్చారు. దానికి భయపడి పరుగెత్తే క్రమంలో పై అంతస్తు నుండి కిందకు పడిపోయానని.. తన రెండు కాళ్లు విరిగిపోయాయని కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రస్తుతం నా రెండు కాళ్లకు శస్త్ర చికిత్స చేసి రాడ్లు వేశారని తెలిపాడు. విశాఖ ఎస్ పి,డిజిపి లకు ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆరోజు రిశాంత్ రెడ్డి పై చర్యలు తీసుకుని ఉంటే.. ఈరోజు పుంగనూరు ఘటన జరిగి ఉండేది కాదని సంతోష్ చెబుతున్నాడు. నాలా ఎవరికీ అన్యాయం జరగకూడదని విలేకరుల సమావేశం పెట్టినట్లు బాధితుడు వివరించాడు.
చంద్రబాబు పర్యటన రాయలసీమలో దాదాపు ప్రశాంతంగా ముగిసింది. కానీ చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి వివాదాస్పదంగా మారింది. దీనికి ఎస్పి రిశాంత్ రెడ్డి కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు కొమ్ము కాయడం కోసం ఎస్పీ రిశాంత్ రెడ్డి పోలీసుల్ని బలి పశువు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. కేవలం వైసీపీ కార్యకర్తలను సేఫ్ గా ఉంచడానికి.. పోలీసులే మూల్యం చెల్లించుకో నేలా ఎస్పీ చర్యలు ఉన్నాయని కామెంట్స్ వినిపించాయి. ఇప్పుడు ఓ బాధితుడే నేరుగా వచ్చి ఎస్పి పై ప్రెస్ మీట్ పెట్టడం సంచలనంగా మారింది.