Raghu Rama Krishna Raju: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామా విషయం ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా ఉంది. నరసాపురం ఎంపీగా అధికార పార్టీ వైసీపీ తరఫున గెలుపొందిన ఆర్ఆర్ఆర్ గత కొంత కాలం నుంచి సొంత పార్టీ ప్రభుత్వంపైన విమర్శలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా, ఆర్ఆర్ఆర్ పై ఇంతకాలం పాటు చర్యలు తీసుకోకుండా వెయిట్ చేసిన ఆ పార్టీ అధిష్టానం త్వరలో అనర్హత వేటు వేసేందుకుగాను రెడీ అయిపోయినట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ రాజీనామాకు తెర తీశారని తెలుస్తోంది.
వచ్చే నెల 5 తర్వాత తాను రాజీనామా చేయబోతున్నట్లు ఆర్ఆర్ఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, అనర్హత వేటు పడబోతుందన్న విశ్వసనీయ సమాచారం మేరకే ఆర్ఆర్ఆర్ రాజీనామా చేసేందుకుగాను రెడీ అయిపోయారనే వార్తలు వస్తున్నాయి. రాజీనామా చేయాలని కొందరు పెద్దలు ఆయనకు సూచించారని, అందుకే ఆర్ఆర్ఆర్ రిజైన్ చేస్తున్నారని వినికిడి.
Also Read: ఇకపై ఇండియాలో ఒకే ఒక్క కార్డు.. అదే ఆధార్, పాన్, డ్రైవింగ్ లెసెన్సు..!
అధికార వైసీపీలో ఉంటూనే రఘురామకృష్ణరాజు ఆ పార్టీని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. దీంతో పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఇలానే వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు ఆర్ఆర్ఆర్ కొనసాగుతారని రాజకీయ వర్గాలు చర్చించుకున్నాయి. కానీ, అనూహ్యంగా పార్టీ అధిష్టానం అనర్హత వేటు వేసేందుకు సిద్ధమైపోవడం, ఆర్ఆర్ఆర్ సైతం రాజీనామా చేస్తున్నారనే వార్తలు వస్తుండటంతో అధికార పార్టీ వైసీపీలో ముసలం రేగుతున్నదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ పై అనర్హత పిటిషన్ ను లోక్ సభ స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపి, ప్రాథమిక దర్యాప్తు చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధిష్టానం ఆర్ఆర్ఆర్ పైన అనర్హత వేటు వేసేందుకు సిద్ధమవడం జరుగుతోంది. అయితే, అలా పార్టీ నుంచి సస్పెండ్ అయ్యే ముందరగానే తనంతట తాను పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఢిల్లీలోని బీజేపీ పెద్దలు రఘురామకృష్ణరాజు కు సూచించారని తెలుస్తోంది. అయితే, ఆర్ఆర్ఆర్ పై అనర్హత వేటు పడే చాన్సెస్ లేవని కొందరు అంటున్నారు. కాగా, ఢిల్లీ పెద్దల సూచన మేరకు ఆర్ఆర్ఆర్ రిజైన్ చేస్తారని సమాచారం. చూడాలి మరి.. ఆర్ఆర్ఆర్ ఏం చేస్తారో.. దానిపైన వైసీపీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో.
Also Read: ఆర్థిక సర్వే విడుదల.. దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే?