YCP Politics: “పన్నుల కట్టు.. ప్రతిఫలం ఆశించకు” అన్నట్టుంది ఏపీలో వైసీపీ సర్కార్ పాలన. ఏపీలో సాగుతున్న పాలన అంత ఓటు బ్యాంకు రాజకీయం కోసమే. మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి, ఉన్నత వర్గాల నుంచి వస్తున్న పన్నుల రూపంలో ఆదాయాన్ని ఓటు కోసం వినియోగిస్తున్నారు. సంక్షేమ పథకాల పేరిట నగదు పనిచేస్తున్నారు. దీంతో ఈ వర్గాలవారు తమకు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉందన్న సంగతే మరిచిపోతున్నారు. పన్నులు కట్టే వాళ్ళని పీడించి.. పిప్పి చేసి.. వసూలు చేసిన దాంట్లో కొంత ఓటు బ్యాంకుకు పంచి.. మిగతాది అస్మదీయ కాంట్రాక్టర్లకు చెల్లించేస్తున్నారు.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పన్నుల పెంపు గణనీయంగా పెరిగింది. చివరకు చెత్తపై కూడా పన్ను వేశారు. అయితే ఇలా పన్ను బాధితులు ఒక వర్గం వారు అయితే.. సంక్షేమ పథకాలకు మాత్రం వీరు అర్హత లేకుండా పోతున్నారు. కానీ ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకానికి ఈ వర్గాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఈ మార్గాన్ని కనుగొన్న ప్రభుత్వం పన్నులు వసూలు చేయడంలో సరికొత్త ఎత్తుగడ వేస్తోంది. నిత్యవసరాల ధరలు, కరెంటు చార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా లెక్కలేసుకుంటూ పోతే.. కుటుంబ జీవనమే కష్టం అవుతుంది. ఇక అడ్డగోలుగా ప్రత్యక్ష, పరోక్ష పనులు పెంచేస్తున్నారు. నెలకు 20,000 సంపాదించే సగటు కుటుంబం.. ప్రభుత్వంపై పెట్టే భారానికి ఆ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వస్తుంది.
ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు కక్కలేక మింగలేక సతమతమవుతున్నారు. వారికి ఎటువంటి సంక్షేమ పథకాలు లేవు. పైగా భారం మోపుతున్నారు. సహజంగానే వారు ప్రభుత్వ వ్యతిరేకులుగా మారారు. అందుకే ప్రభుత్వం వీరిని ఓటు బ్యాంకుగా గుర్తించడం లేదు. అందుకే వారిది అరణ్య రోదనగా మిగులుతోంది. పోనీ పథకాలు అందుకున్న నిరుపేదల కుటుంబాల నుంచి మరో రకమైన వసూలు. నిరుపేద కుటుంబాల్లో ఎవరికైనా మద్యం అలవాటు ఉన్నట్లయితే.. ప్రభుత్వం ఇచ్చే దానికంటే.. ఆ కుటుంబం నుంచి పీల్చుకునేదే ఎక్కువ. ఈ విషయం ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతోంది. సమాజంలో సగం మందిని దోపిడీ చేసి.. మరో సగం మందికి పంచి.. వారి నుంచి ఇతర మార్గాల్లో లాగేసి పాలన సాగిస్తున్న వారిని ఏమనాలి? ఏమని వర్ణించాలి?